కూసుమంచి, మార్చి 7: వారం రోజుల్లో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామన్నారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు. లబ్దిదారుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా మళ్లీ విడతలో అధికారులు నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు. మత్స్యకార మహిళలను బలోపేతం చేయడానికి మత్స్య సహకార సంఘాల మహిళలకు మొబైల్ ఫిష్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. తొలిసారిగా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని నాయకన్ గూడెం జేకే మహిళా సంఘానికి వ్యాపార నిమిత్తం మొబైల్ వ్యాన్ అందజేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ మిజ్ మిల్క్ ఖాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.