మధిర, అక్టోబర్ 03 : సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో టెట్ (TET) ఉత్తీర్ణత సర్వీస్‌లో కొనసాగడానికి, పదోన్నతి పొందడానికి తప్పనిసరి కావడం సీనియర్ ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర డివిజన్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్ మినహాయింపు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు టెట్ తీర్పుపై తక్షణమే అప్పీల్ చేసి, సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్సీటీఈ నోటిఫికేషన్‌కు ముందు నియమించబడిన ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. టెట్ సిలబస్, ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని ఉపాధ్యాయులకు అనుకూలంగా సవరించాలన్నారు.
పదోన్నతుల్లో మిగిలిపోయిన ఖాళీ పోస్టులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. మోడల్ స్కూల్స్‌లో దశాబ్ద కాలంగా నిలిచిపోయిన పదోన్నతుల సమస్యలను పరిష్కరించి, పదోన్నతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నందున సర్వీస్ రూల్స్ సవరించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మధిర డివిజనల్ కార్యాలయ కన్వీనర్ వినోద్ రావు, మధిర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.నాగరాజు, వీరయ్య, ఉపాధ్యక్షుడు ఇబ్రహీం, కార్యదర్శులు లాల్ అహ్మద్, బి.రమేశ్ బాబు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.