బోనకల్లు, మార్చి 27 : గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య వీరభద్రం నాయక్ అన్నారు. గురువారం బోనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో ట్రైకార్ రుణాలను రద్దు చేసిన సందర్భంగా ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గిరిజనులకు ట్రైకార్ ద్వారా మంజూరు చేసిన రుణాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. మండల పరిధిలోని 14 మంది గిరిజనులకు ట్రైకార్ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రుణం మంజూరు చేసినట్లు తెలిపారు.
లబ్ధిదారులు రుణం కోసం మండల పరిషత్ కార్యాలయం చుట్టూ, ట్రైకార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ట్రైకార్ అధికారులు ఎంపికైన 14 మందికి సంబంధించి రుణాల చెక్కులను తయారు చేస్తున్నట్లు తెలిపారన్నారు. కానీ ఒక్కసారిగా రాజీవ్ యువ వికాసం ప్రకటిస్తూ ట్రైకార్ ద్వారా మంజూరైన రుణాలను కూడా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. గిరిజనులు ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మందికి ట్రైకార్ ద్వారా రుణాల కోసం ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులను సమీకరించి ఏప్రిల్ 7న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు పంతు, నాయకులు గుగులోతు వేణుగోపాల్, గుగులోత్ నరేశ్, అజ్మీర వీరాంజి, బానోతు గోపి, ధరావత్తు నరేశ్, బానోతు ఉపేందర్, బానోతు దినేశ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Tricor Loans : గిరిజనులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : భుక్య వీరభద్రం