అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది 21 స్కూళ్లను ప్రారంభించగా.. ఈ ఏడాది ఏకంగా 118 స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ఈ స్కూళ్లలో టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా సిద్ధమైంది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి చిన్నారుల ఆరోగ్య రక్షణతోపాటు ఆటపాటలతో కూడిన విద్య నేర్పిస్తున్న అంగన్వాడీల స్కూళ్లకు రేవంత్ సర్కార్ మంగళం పలికేటట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను ఇస్తూ పూర్వ ప్రాథమిక విద్యా పథకాన్ని అంగన్వాడీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 9 (నమస్తే తెలంగాణ)
గత ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆయా పాఠశాలకు నిధులు కూడా మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేశారు. పిల్లలకు ఆట వస్తువులు, మెటీరియల్ కోసం నిధులు స్థానిక విద్యాశాఖకు అందాయి. ఒకవైపు అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కు సంబంధం లేదని చెప్తూనే అంగన్వాడీ పిల్లలను స్కూల్స్‌లో చేర్చుకోవడంపై అంగన్వాడీ టీచర్లు అభ్యంతరం చెప్తున్నారు. మా పిల్లలను మీరు ఎట్లా తీసుకెళ్తారని వారు ఆందోళన చెందుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో జీరో టు 3, త్రీ టు 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు వివిధరకాల సేవలందిస్తున్నారు. దీంతోపాటు చిన్నపిల్లల తల్లులకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా భోజనం అందిస్తున్నారు. పాలు, గుడ్లు, చిన్నారులకు బాలామృతంతోపాటు మూడునెలలకు ఒకసారి టీకాలు ఇస్తుండడంతో పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు పెద్ద రక్షణగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రాలను తీసేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే పథకాన్ని తీసుకొచ్చి అదే వయస్సు పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నది. దీంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఏళ్లుగా నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ యూనియన్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది నుంచి యూనియన్ నాయకులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు వీటికి సంబంధం లేదని చెబుతున్నది. అయితే పిల్లలకు రెండుచోట్ల ఎలా అడ్మిషన్ ఇస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొత్త విద్యా కమిషన్ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇలాంటి జిమ్ముక్కులు చేయడం చాలా బాధాకరమని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీల జోలికొస్తే ఊరుకునేది లేదు. కేంద్రాల నిర్వహణ అంగన్వాడీలే చేసుకుంటారు. పిల్లలను వేరే స్కూల్స్‌లో చేర్పిస్తే ఆందోళన చేస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేదాక పోరాటాలు చేస్తాం. ఒకే వయస్సు పిల్లలకు రెండుచోట్ల ఎట్లా అడ్మిషన్ ఇస్తారు. ఇవి రెండూ వేర్వేరు శాఖలు. కలిసే ప్రసక్తేలేదు.
– సీతామహాలక్ష్మి, ఏఐటీయూసీ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకురాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేయాలి. లేకపోతే రద్దు చేయాలి. అసలే ప్రభుత్వ పాఠశాలలు ఒకపక్క మూతబడే దశలో ఉంటే.. చిన్నారుల కోసం ప్రీ ప్రైమరీ స్కూళ్లు పెట్టడం ఏమిటీ.. ఇది చూస్తుంటే.. ముమ్మాటికీ అంగన్వాడీలకు ద్రోహం చేసేందుకే అన్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని తీసేసినా ఊరుకునేదిలేదు.
– పద్మ, సీఐటీయూ అంగన్వాడీ జిల్లా నాయకురాలు
పిల్లల కోసం గత ఏడాది నుంచే ప్రీ ప్రైమరీ స్కూల్స్ పెట్టారు. ప్రయోగాత్మకంగా సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఈ ఏడాది కూడా 118 స్కూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంగన్వాడీలో పిల్లలు, ఇక్కడ పిల్లలకు తేడాగురించి పూర్తిస్థాయిలో విధివిధానాలు ఇంకా రాలేదు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పిల్లలను జాయిన్ చేసుకుంటారు.
– శంభుప్రసాద్, ఏడీఈ, భద్రాద్రి కొత్తగూడెం