ఖమ్మం, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మీరు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా..? అందుకు తగిన స్థలం వెతుకుతున్నారా..? మీ ఆర్థిక స్తోమతకు తగిన ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారా..? స్థలాలు, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాలు, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ కొనాలనుకుంటున్నారా…? ఇంటి నిర్మాణానికి బ్యాంక్ రుణం తీసుకుని నెలనెలా కిస్తీలు చెల్లిద్దామనుకుంటున్నారా..? అయితే ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ నిర్వహించే ప్రాపర్టీ షో మీ కోసమే. ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వేదికగా శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంకర్లు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, బ్యాంక్ రుణాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాపర్టీ షోకు హాజరైన వారికి బహుమతులు అందుకునే అవకాశాన్నీ నిర్వాహకులు కల్పిస్తున్నారు. తొలిరోజు షోను ఖమ్మం పోలీస్ కమిషనర్ సీపీ విష్ణు ఎస్ వారియర్ ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పలువురు ఎమ్మెల్యేలు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగర మేయర్ పునకొల్లు నీరజ, నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర ఉప మేయర్ ఫాతిమా జోహ్రా పాల్గొంటారు. రెండో రోజు ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
స్టాళ్లు ఏర్పాటు చేసే సంస్థలు ఇవీ..
ప్రాపర్టీ షోలో ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు శ్రీబాలాజీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, శ్రీసిటీ-2, శ్రీనిధి ఎన్క్లేవ్, శ్రీజయవిలాసిని డెవలపర్స్, అమెరికన్ టౌన్ షిప్-2, ఆదార్ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్ట్రక్చర్స్ ఎల్ఎల్పీ, సుప్రీం లీనస్ ఇండియా, సన్‌రైజ్ ఇన్ఫ్రా, ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్, జీఆర్ రియల్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్, పినాకిల్ హైట్స్, సెన్సేషన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, యుకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, , డిస్ట్రిక్ట్ కో-ఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) వంటి బ్యాంకులు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నాయి. వెంచర్లు, అపార్ట్మెంట్స్, విల్లాలు, ఇండిపెండెంట్ హౌసెస్, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, బ్యాంకు రుణాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించనున్నాయి. ప్రాపర్టీ షోకు వచ్చే సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటయ్యే వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, వెంచర్లు, బ్యాంక్ రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రెండు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.