తిరుమలాయపాలెం, జూన్ 9: ఈ వానకాలం సీజన్లో పాలేరు నియోజకవర్గంలో ఆయకట్టు చివరి భూములకు కూడా ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని తిరుమలాయపాలెం, వెదుళ్లచెరువు, పిండిప్రోలు, తెట్టెలపాడు, జల్లేపల్లి, తిప్పారెడ్డిగూడెం, పాతర్లపాడు, చంద్రుతండ, గోల్‌తండా తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. ఎస్సారెస్పీ లింక్ కాల్వలను పూర్తిచేసి అన్ని గ్రామాల్లో చెరువులను నింపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏడాదిలోపు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలకు లింక్ రోడ్లు, బీటీ రోడ్లను దశల వారీగా నిర్మిస్తామని చెప్పారు.
తన సొంత నియోజకవర్గమైన పాలేరులో మూడేళ్లలో అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. మొదటి దశలో అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జరుగనున్న మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపికబురు అందించనున్నట్లు చెప్పారు. అర్హులకు త్వరలోనే రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. అలాగే అనర్హుల పింఛన్లు తొలగిస్తామని అన్నారు. గ్రామసభల్లో భూసమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించారు. తిరుమలాయపాలెంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ పనులను, పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ పనులను పూర్తిచేస్తామన్నారు. పిండిప్రోలులో డిగ్రీ కళాశాల నిర్మాణ అవశాలను పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై పెద్ద సంఖ్యలో అందించిన వినతిపత్రాలను మంత్రి స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కాగా, మంత్రి పొంగులేటి పర్యటనలో కాంగ్రెస్ వర్గపోరు మళ్లీ బయటపడింది. మండలంలోని పిండిప్రోలు గ్రామంలో రెండు వర్గాలు వేర్వేరు సభలను ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా ఆ రెండు వర్గాల సభలకూ హాజరయ్యారు.