ముదిగొండ, ఏప్రిల్ 6: వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని (Sri Rama Kalyanam) ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామంలోనూ సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయాన స్వామివార్ల కళ్యాణం జరగటం విశిష్టత. ఖమ్మం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ముత్తారం గ్రామంలో ప్రజల ఇలవేల్పు శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల అత్యంత ప్రాచీన విశిష్టత కలిగిన రామాలయం ఉన్నది. భద్రాచలంలో సీతారాముల విగ్రహాలను పోలి ఉండి ఆ స్వామి వారే స్వయంభువుగా వెలిశాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.
పూర్వం భక్త రామదాసుకు సమకాలికుడైన వనం కృష్ణరాయలు అనే భక్తుడు ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం తిలకించటానికి ముత్తారం నుంచి స్వయంగా వడ్ల గింజలను గోటితో వలిచి తలంబ్రాలు కల్పి తీసికొని భద్రాచలం వెళ్లేవాడు. ఈక్రమంలో ఆయన వృద్ధాప్యం సమీపంలో ఓ ఏడాది రాముల వారి కళ్యాణానికి వెళుతుండగా భద్రాచలం సమీపంలోకి వెళ్లేసరికి స్వామివారి కళ్యాణం ముగిసింది. ‘గోవిందా’ అనే నామస్వరం విన్పించి మూర్చిల్లి పడిపోయాడు. ఆవిధంగా ఆరోజు మదనపడుతూ అక్కడే తెల్లవారే వరకు ఉండిపొయాడు. ఆ రాత్రి ఆయన స్వప్నంలో స్వామి వారు సాక్షాత్కరించి భక్తా ఇక నుంచి నువ్వు నాదగ్గరకు రాలేవు, నేనే నీ వద్దకు వస్తాను అందుకు నీ ఆవుల కొష్టం పుట్టలో వెతికి చూడండి అని చెప్పాడు. తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చి తన స్వప్న విషయాన్ని గ్రామస్తులకు వివరించాడు. గ్రామస్తులంతా ఆ పుట్టలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు పొయ్యగా పొద్దుగూకే సమయంలో దేదీప్యమైన వెలుగుతో ఒక శిలమీద స్వామి వారు సీతారామలక్ష్మణుల విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే గ్రామస్తుల సహకారంతో అక్కడే స్వామివారికి గుడి కట్టించి దీపదూప నైవేద్యాలు చేపట్టారు.
స్వామివారి కి ధూప దీప నైవేద్యా లు ఇతర కైంకర్యాల నిర్వహణకు వనం కృష్ణరాయలు, ఆయన కుమారులు తమకున్న స్థిరాస్తిలో 150 ఎకరాల సేద్యభూమిని స్వామివారికి మాన్యంగా సమర్పించుకున్నాడు. ఆ భూములు నేడు దేవదాయ శాఖ ఆదీనంలో ఉన్నాయి. ఆనాటి నుండి నేటి వరకు ఆభూమిపై వచ్చే ఆదాయంతో స్వామివారి దూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆయన జ్ఞాపకంగా దేవాలయంలో కృష్ణరాయలు విగ్రహాన్ని ప్రతిష్టించారు.
దేశమంతటా సీతారామ కళ్యాణం పగటిపూట జరుగుతుండగా ఇక్కడ సాయంత్రం 6గంటల తర్వాత సంద్యా సమయాన జరగటం విశిష్టత. స్వామివారు సంద్యా సమయాన ప్రత్యక్షమయ్యాడనే నమ్మకంతో, భద్రాచలంలో కళ్యాణం జరిగిన తరువాతనే ఇక్కడ రాములవారి కళ్యాణం జరపాలనే ఆనవాయితీతో సాయంత్రం కళ్యాణం జరిపిస్తూ వస్తున్నారు. భద్రాచల కళ్యాణ తలంబ్రాలు తీసుకు వచ్చి ఇక్కడి తలంబ్రాలలో కలపటం ఆచారంగా వస్తున్నది. ఈదేవాలయంలో పూజలు జరిపించుకుంటే పలువురికి తమ కోర్కెలు నెరవేరాయని అనాదినుండి వస్తున్న భక్తుల విశ్వాసం. పలువురికి దీర్ఘకాల వ్యాదులు నయం అయ్యాయని, ఎప్పుడో పోయిన ఆస్తులు తిరిగి కలిసి వచ్చాయిని, మొండి కోర్టు కేసులు వంటివి పరిష్కారం అయ్యాయని, ఉద్యోగప్రాప్తి కల్గిందని, పెండ్లికాని వారికి స్వామివారిని దర్శించుకుంటే వివాహయోగం లభించిందని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు. అత్యంత మహిమ కల్గిన స్వామివారు ముత్తారం సీతారామచంద్రస్వామి అని స్తానికులు చెప్పుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ కూడా సందర్శించారు. అప్పటి ఆయన సి పి ఆర్ ఓ అయిన గ్రామానికి చెందిన వనం జ్వాలా నర్సింహారావు ఈ దేవాలయ విశిష్టత గురించి వివరించగా కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరగా 2011 లో దాతలు, గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మించి వైభవంగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.