ఖమ్మం అర్బన్, ఆగస్టు 24 : ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసిన అధికారి.. నిత్యం సమీక్షలతో నూతన లక్ష్యాలను నిర్దేశించిన బాస్.. పాఠశాల విద్యలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అదనపు కలెక్టర్ ఇక నుంచి విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా డాక్టర్ పీ శ్రీజ సోమవారం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి డీఈవో కార్యాలయం అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఫైల్స్‌తో నిండిపోయి ఉన్న డీఈవో చాంబర్లో ఫైల్స్‌ను అక్కడి నుంచి తీసి గదిని కూడా శుభ్రపరిచారు. పలు జిల్లాల్లో అదనపు కలెక్టర్లకే డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
జిల్లాలో అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి డాక్టర్ పీ శ్రీజ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. డీఈవోతోపాటు సెక్టోరల్స్ అధికారులతో నేరుగా మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటూ సూచనలు చేసేవారు. స్పౌజ్ బదిలీల విషయంలో, ఉపాధ్యాయుల సర్దుబాటులో ఆమె నేరుగా పరిశీలించాకే ఆమోదించారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనూ నియోజకవర్గస్థాయిలో ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహించి ప్రతి అంశంపై చర్చించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ విద్యాశాఖలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు కావొస్తున్నా రెండో జత యూనిఫాం రాలేదు.. జూన్, జూలైలో ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల స్థానంలో ఇప్పటికే సర్దుబాటు చేయకపోవడంతో చాలా స్కూల్స్‌లో బోధన ప్రారంభం కాని సబ్జెక్ట్‌లు ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట నిర్వహిస్తున్న పనుల్లో నాణ్యత లేమిపై ఆరోపణలున్నాయి. వీటితోపాటు చాలా సమస్యలున్నాయి.