ఖమ్మం, నవంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగులలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, వారిలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంపొందించేందుకు ఈ నెల 3న తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంతో వన సమారాధన నిర్వహించున్నట్లు టీజీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.
నగరంలోని గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి మామిడి తోటలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, నాగిరెడ్డి, టీజీవో నాయకులు కస్తాల సత్యనారాయణ, కార్యదర్శి వేలాద్రి, గుంటుపల్లి శ్రీనివాస్, కొణిదెల శ్రీనివాస్, జయపాల్, ఇతర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం హాజరవుతారని, 206 సంఘాలతో జేఏసీ ఏ విధంగా ఏర్పడిందో అదే విధంగా దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ ప్రయత్నమని అన్నారు.
కుల, మత, రాజకీయాలకతీతంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, సీపీలను ఆహ్వానించామన్నారు. ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనానికి ఉద్యోగ కుటుంబ సభ్యులు భారీగా తరలిరావాలని కోరారు. నగరంలోని ఆరు సెంటర్ల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.