ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 29: స్పెషల్ రివర్షన్ ఎట్టకేలకు సంపూర్ణమైంది. నిబంధనలు అతిక్రమించి పదోన్నతులు పొందిన ఆరుగురిలో మిగిలిన ఇద్దరిని కూడా రివర్షన్ చేశారు. కానీ వారికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం కొసమెరుపు. గత జూన్లో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయ పదోన్నతుల్లో నిబంధనలను అతిక్రమించి ఆరుగురికి పదోన్నతి కల్పించిన విషయాన్ని వరుస కథనాలతో ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ‘రివర్షన్తో సరి..చర్యలేవి మరి?’ అనే శీర్షికన శనివారం ప్రచురించిన కథనానికి స్పందించిన డీఈవో.. మిగిలిన ఇద్దరికి కూడా రివర్షన్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ ఎట్టకేలకు రివర్షన్ ఇచ్చి ఆ ఆరుగురిని ఎస్జీటీలుగా వెనక్కి పంపింది. ఎస్జీటీలుగా స్వచ్ఛందంగా వెనక్కి వెళ్తామని రాసివ్వాలంటూ నలుగురిని కోరగా వారు అంగీకరించడంతో వారు కోరిన ప్రదేశాలు కేటాయించారు. మిగతా ఇద్దరి విషయంలో తాత్సారం జరుగుతోంది. వారిపై చర్యలు తీసుకోకుండా వారం రోజులుగా డీఈవో తాత్సారం చేశారు. చివరకు డీఈవో ఆ ఇద్దరిపై ఈ నెల 28న రివర్షన్ వేటు వేశారు. అయినప్పటికీ వారికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.
స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు స్పెషల్ బీఈడీతోపాటు ఆర్సీఐ జారీ చేసిన సీఆర్ఆర్ తప్పనిసరిగా ఉండాలి. సీఆర్ఆర్ లేకపోయినప్పటికీ సీఆర్ఆర్ కోసం తాము ఐప్లె చేసుకున్నామని చెబుతూ దరఖాస్తు చేసుకోవడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయ వర్గాలు వారికి సహకరించి పదోన్నతి కల్పించాయి. దీని ప్రకారం ఈ పోస్టుకు సీఆర్ఆర్ ఉండాలనే విషయం ఆ అభ్యర్థులకు తెలిసినట్టే కదా అని విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది అంటున్నారు.
అలాంటప్పుడు తమకు అర్హత లేకుండా ప్రమోషన్ పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకున్నారని ప్రశ్నిసున్నారు. ఇది తమను తప్పు దారి పట్టించడమేనని అంటున్నారు. మరోవైపు తాము దరఖాస్తు చేసుకుంటే సరిగ్గా పరిశీలించకుండా అసలు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారని, ఇప్పుడు తమను ఎందుకు తీసేస్తున్నారని, దీనికి బాధ్యులైన డీఈవో కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు వాదిస్తున్నారు. ఈ మొత్తం విషయాన్ని గమనిస్తున్న ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ఇరువురి వాదనా సబబేనని, ఇరువురి తప్పిదమూ ఉందని అన్నారు. అందువల్ల రెండు వైపులా బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
పదోన్నతుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విద్యాశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అర్హత లేని ఉపాధ్యాయులకు రివర్షన్ ఇచ్చాం. ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ కూడా కల్పించాం.
-సోమశేఖరశర్మ, ఖమ్మం డీఈవో