ఉద్యమ నేతగా తెలంగాణను సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు.. రైతులు, కులవృత్తిదారులు, మహిళలు, కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.. రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేయిస్తున్నారు.. దీనిలో భాగంగా ఇప్పటికే రెండో విడత ‘కంటి వెలుగు’ అమలు చేస్తున్నారు.. లక్షలాది మందికి చూపును ప్రసాదిస్తున్నారు.. అంతేకాదు.. తాజాగా కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ‘మే డే’ రోజు మరో వరాన్ని ప్రకటించారు.. లేబర్ కార్డు పొందిన ప్రతిఒక్కరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని, వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు సిఫార్సు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లావ్యాప్తంగా 50 వేల మందికి పైగా కార్మికులు లబ్ధి పొందనున్నారు.
– కొత్తగూడెం అర్బన్, మే 5
కొత్తగూడెం అర్బన్, మే 5: గతంలో ఏ ముఖ్యమంత్రైనా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించారా.. కార్మికులు మంచిగుండాలని కోరుకున్నరా.. వారి ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా.. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. స్వేదం చిందిస్తున్న కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన కార్మికుడు అనారోగ్యం పాలైతే ఆ కుటుంబమంతా ప్రభావితమవుతుంది. వారి ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ మే డే సందర్భంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు.
కార్డు ఉంటే చాలు
భవన నిర్మాణ రంగ సంక్షేమ మండలి నుంచి గుర్తింపు కార్డు తీసుకున్న ప్రతి కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. వైద్యాధికారులు ఉచితంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఊపిరితిత్తులు, కంటిచూపు, చెవి, ముక్కు, గొంతు, రక్తం, మూత్రం, షుగర్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైతే హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రధానాసుపత్రులకు సిఫార్స్ చేస్తారు. చిన్న సమస్యలైతే స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. భద్రాద్రి జిల్లాలో వైద్యులు తొలివిడతగా 51,142 మంది భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలకు వైద్య పరీక్షలు చేయనున్నారు. మలి విడతలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, రాడ్బెండర్లు, మట్టిపని చేసేవారికి వైద్య పరీక్షలు చేస్తారు. మే డే రోజు బూర్గంపాడు మండలంలో వైద్యశిబిరం ప్రారంభమైంది. వైద్యులు ప్రతిరోజు 250 మందికి వైద్యపరీక్షలు చేయనున్నారు.
వైద్యపరీక్షలతో భరోసా..
గతంలో ఏ ప్రభుత్వమూ మా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. మందులు ఇస్తున్నారు. కార్మికులు పని చేసుకుంటేనే పూట గడుస్తుంది. ప్రభుత్వం మా కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించడం ఆనందాన్నిచ్చింది.
– తాటి సరోజిని, కార్మికురాలు, బూర్గంపాడు
కార్మిక పక్షపాతి కేసీఆర్..
కార్మికుల గురించి ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న మాలాంటి కార్మికులకు వైద్యశిబిరాలు ఎంతో ఉపయోగకరం. ఆరోగ్య సమస్యలున్న వారిని పెద్దాసుపత్రులకు సిఫార్సు చేయిస్తాననడం భరోసానిచ్చింది.
– కుంజా రాంబాబు, కార్మికుడు, బూర్గంపాడు
ప్రతి కార్మికుడికి వైద్య పరీక్షలు..
గుర్తింపుకార్డు ఉన్న ప్రతి కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. ఉచితంగా మెడిసిన్ అందిస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. కార్మిక సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.
– షరీఫుద్దీన్, కార్మికశాఖ సహాయ కమిషనర్, కొత్తగూడెం