భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమస్తే తెలంగాణ): జనజీవనానికి ఇప్పడు అత్యంత ప్రధానమైనది ఆధార్. అది లేకపోతే ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతాయి. దీంతోపాటు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తీసుకున్న ఆధార్‌కార్డుల్లో అప్డేట్లు చేసుకోకపోవడం, అప్పట్లో ఇచ్చిన ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీలు సరిగ్గా వేయకపోవడం వంటి కారణాలతో ఆధార్‌లో ఎన్నో తప్పొప్పులు దొర్లిపోయాయి.
కానీ వాటిని సరిచేసుకోవడానికి జిల్లాలో ఆధార్ సెంటర్లు ఉన్నా సరైన రీతిలో అప్లికేషన్లు పూర్తిచేయక ఆధార్ అప్డేట్కాక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని అధిగమించడానికి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బాధితుల ముంగిటకు ఆధార్క్యాంపును అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో జిల్లాలో ఆధార్ సెంటర్లు ఉన్నప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల బాధితులు ఆధార్ కేంద్రాల వద్దకు తిరుగుతుండంతో సమస్యను తెలుసుకున్న కలెక్టర్ రెండ్రోజులపాటు కలెక్టరేట్లో ఆధార్ క్యాంపును ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో ప్రతి వ్యక్తికి ఆధార్‌కార్డులు ఉన్నప్పటికీ అవి తప్పులు తడకలుగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో 33 ఆధార్ కేంద్రాలు నడుస్తున్నాయి. అయినా కొన్ని సమస్యలు ఇక్కడ పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్‌లోని రీజనల్ సెంటర్‌కు వెళ్లాల్సి వస్తున్నది. ఇందుకోసం కలెక్టరేట్లో 20 మంది సిబ్బందితో 20 కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు జరిగే ఈ క్యాంపులో చాలామంది వారి సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే 63వేల మంది బాధితుల ఆధార్ సమస్యలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారికంగా రీజనల్ సెంటర్ వారు లెక్కలు తీశారు. దీంతోపాటు ఇంకా 15వేల మంది అసలు ఆధార్‌కార్డులు లేనివారు ఉన్నట్లు గుర్తించారు. ఇంటిపేరు మారాలన్నా, పుట్టినతేదీ మారాలన్నా ఒకసారి మాత్రమే ఆధార్కేంద్రంలో సరిచేయడం కుదురుతుంది. రెండోసారి మార్చాలంటే వారు హైదరాబాద్ వెళ్లాల్సిందే. చాలామందికి వేలిముద్రలు పడకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో వారు పింఛను తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో ఆధార్ క్యాంపు కలెక్టరేట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇరవై టేబుల్స్ ఏర్పాటు చేసి ఇరవై మంది సిబ్బందితోపాటు రీజినల్ సెంటర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆధార్ రాజ్యలక్ష్మి ప్రసన్న, మరో ఐదుగురు అధికారులు కూడా హాజరవుతున్నారు.
ఎంతోమంది ఆధార్‌కార్డుల్లో తప్పులు ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వారందరి సమస్యలకు పరిష్కారం కోసమే ఈ ఆధార్ క్యాంపును ఏర్పాటు చేశాం. ఆధార్ కేంద్రాలు ఆయా డివిజన్ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీస్ల్లో ఉన్నా అప్లికేషన్లు పూర్తిచేయడంలో తప్పులు, అసంపూర్తిగా సమాచారాలను ఇవ్వడం వల్ల ప్రతిఒక్కరివి రిజెక్టు అవుతున్నాయి. అందువల్ల రీజినల్ ఆఫీస్ వారితో మాట్లాడి కలెక్టరేట్లో క్యాంపును ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-జితేశ్ వీ పాటిల్, కలెక్టర్, భద్రాద్రి