మధిర, ఆగస్టు 02 : మధిర ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం శంకర్రావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున మధిర డిపో నుంచి తీర్థయాత్ర బస్ సర్వీసుకు ఆయన పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిర నుండి ఏపీలోని అంబేద్కర్ కొనసీమ జిల్లాలోని వాడపల్లిలో గల ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామి ఆలయానికి, అలాగే రాజమండ్రికి సమీపంలోని ఆత్రేయపురం మండలంలోని ర్యాలిలో కొలువైన జగన్మోహిని సమేత శ్రీ కేశవ స్వామి ఆలయానికి దీంతో పాటు కోనసీమ జిల్లాలోనే సకినేటిపల్లి మండలంలో గల అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ జీ.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్చార్జి బి.వెంకటేశ్వర్లు, మధిర బస్టాండ్ కంట్రోలర్ ఎం.రామచంద్రరావు, కే వీ రెడ్డి, విలేజీ బస్ ఆఫీసర్ ఎస్కే ఎన్.మీరా, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.