కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 27: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ.. 22 ఫ్లయింగ్ స్కాడ్ బృం దాలు, 6 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, 6 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, 4 అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఫ్లయింగ్ స్కాడ్ టీమ్(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్(ఎస్ఎస్టీ), చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి కొన్ని ముఖ్యమైన సూ చనలు చేసినట్లు తెలిపారు. తప్పనిసరిగా మండల ప్రధాన కార్యాలయంలోనే ఉండాలని, రిలీవర్ వచ్చే వరకు డ్యూటీ స్థలాన్ని విడిచి వెళ్లొద్దని సూచించారు. వాహన తనిఖీల్లో భాగంగా వాహన నెంబర్, సమయం, ప్రయా ణం ఉద్దేశం, తీసుకున్న చర్యతో సహా రిజిస్టర్లో కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
డబ్బు, మద్యం, బంగారం, విలువైన వస్తువులు దొరికితే వాటికి కాపలా ఉంటూ.. ఇన్చార్జి బృందానికి సహాయం చేస్తూ సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు ఎస్కార్ట్ చేసి, ఎస్హెచ్ఓ, ఇన్స్పెక్టర్ లేదా డీఎస్పీకి తెలియజేయాలన్నారు. ఏ పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసుకోవాలని, వాహనాల తనిఖీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కోరారు.