కొత్తగూడెం టౌన్, మే 15 : సుజాతనగర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసిందని అన్నారు. తమ శాఖకు అందించిన మార్గదర్శకాల ప్రకారం తాము కూడా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా జిల్లాలోని పోలీసు అధికారులు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే, కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులతోపాటు పోలీసులకు కూడా సమాచారం అందించాలని రైతులను కోరారు. అనంతరం ధాన్యం కొనుగోలు విధానాన్ని, ధాన్యం గ్రేడింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. డీఎస్పీ ఆదినారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమాదేవి, రవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.