కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 15: పోలీసు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ప్రతీ కేసులోనూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో నెలవారీగా నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, క్రయవిక్రయాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, వాటి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా హాట్ స్పాట్లను గుర్తించి గంజాయి రవాణా చేసే వ్యక్తులతోపాటు సేవించే వారిపై సైతం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించి.. సంబంధిత అధికారులతో సమష్టిగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలన్నారు. అనంతరం జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పతకాలు సాధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వర్టికల్స్ వారీగా ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీఎస్పీలు షేక్ అబ్దుల్ రెహమాన్, ఆర్.సతీశ్‌కుమార్, చంద్రభాను, వి.రవీందర్‌రెడ్డి, మల్లయ్యస్వామి, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.