కొత్తగూడెం ప్రగతిమైదాన్, జూన్ 3 : అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని తన కార్యాలయంలో ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, సింగరేణి రెస్యూ టీం, అగ్నిమాపక శాఖలతో సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదురొనేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్, విరిగిపోయిన చెట్లను తొలగించడానికి కావాల్సిన కట్టర్లు, ఇతర రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతికుమార్, టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ మరియదాస్, ఆపరేషన్ ఆర్ఐ బి.రవి, సింగరేణి రెస్యూ టీం ఇన్చార్జి అనంతరాములు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సుమంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.