బోనకల్లు, మార్చి 31 : తండ్రిని కాపాడబోయి చెరువు నీటిలో మునిగి తండ్రితో పాటు కొడుకు కూడా మృత్యువాతపడ్డ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పఠాన్ యూసుఫ్ మియా (65) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. ఇంటి సమీపంలో గల ఊర చెరువులోకి దిగాడు. నీటిలో మునిగిపోతుండడాన్ని గమనించిన కొడుకు పఠాన్ కరీముల్లా (45) తండ్రిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు.
గతంలో చెరువులో ప్రోక్లైన్ల ద్వారా పెద్దపెద్ద గోతులు తీసి మట్టిని తరలించారు. మట్టి తోలకాలు జరపడం వల్ల గోతులన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. తండ్రి తన కళ్లముందే చెరువు నీటిలో మునిగిపోవడంతో కాపాడేందుకు తాను కూడా వెళ్లి అదే చెరువులోని గోతిలో మునిగిపోయాడు. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరూ మృతి చెందారు. స్థానికులు గుర్తించి చెరువులోకి దిగి మృతదేహాలను వెలిగితీశారు. అప్పటివరకు గ్రామంలో ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకుని ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. యూసుఫ్ మియాకు భార్య ముగ్గురు కొడుకులు. కరీముల్లాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.