పెనుబల్లి, మే 5: వందేళ్ల భూసమస్యకు తెలంగాణ సర్కారు పరిష్కారం చూపింది. ఇందుకు కృతజ్ఞతగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫ్లెక్సీకి రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు గురువారం పెనుబల్లిలోని ఎంపీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని తాళ్లపెంట రెవెన్యూ గ్రామంలో 320 సర్వే నెంబర్లు మాత్రమే రికార్డుల్లో నమోదై ఉన్నాయి. అక్కడి నుంచి 625 వరకూ ఉన్న సర్వే నెంబర్లు, వాటిల్లోని భూముల వివరాలు రికార్డుల్లో లేవు. ఇదే విషయంపై 2019 ఏప్రిల్‌లో ‘వందేళ్ల నిరీక్షణ’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ తన ‘ధర్మగంట’లో కథనాన్ని ప్రచురించింది.
ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సదరు చిన్న, సన్నకారు రైతులు రెవెన్యూ అధికారులను, ఎమ్మెల్యే సండ్రను కలిసి విన్నవించారు. ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే సండ్ర.. కలెక్టర్ సహకారంతో హైదరాబాద్‌లో సీసీఎల్ఏ కమిషనర్‌ను సంప్రదించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో రెండు విడతల్లో రైతులు చూపించిన పత్రాలను నేరుగా నమోదు చేయడంతో సీసీఎల్ఏ నుంచి డిజిటల్ రూపంలో పట్టాదారు పాస్ బుక్‌లు మంజూరయ్యాయి. మొదటి విడతలో 357.39 ఎకరాలకుగాను 152 మందికి రైతులకు, రెండో 462 ఎకరాలకు గాను 336 మంది రైతులకు ఎలక్ట్రానిక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారయ్యాయి. మొత్తం 819 ఎకరాలకు సంబంధించిన 488 మంది రైతుల సమస్య పరిష్కారం కావడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సండ్ర ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకటరావు, భూక్యా ప్రసాద్, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, రాయపూడి మల్లయ్య, తేజావత్ తావూనాయక్, కనగాల సురేశ్‌బాబు, కాకా సీతారాములు, గువ్వల వెంకటరెడ్డి, లక్కినేని వినీల్, చీకటి రామారావు, అవులూరి వెంకటరెడ్డి, జగన్, భూక్యా ప్రసాద్, బానోత్ ఛత్రియా, ఆళ్ల రాంబాబు, ఏట్కూరి హరీశ్, పరిమి ప్రసాద్ పాల్గొన్నారు.