‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్ ఉగ్రమూకలను తుదముట్టించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత సైన్యానికి యావత్ యువత సంఘీభావం ప్రకటించింది. పాక్ పన్నాగాలను, కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులను మన సైన్యానికి ప్రసాదించాలని కోరుకుంది. శనివారం జాతీయ జెండాలు చేబూని జై భారత్.. జై జవాన్ అని నినాదాలు చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఖమ్మంలో కార్పొరేటర్ల ర్యాలీ
ఖమ్మం, మే 10 : భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, కార్పొరేటర్లు, ఉద్యోగులు నగరంలో శనివారం ర్యాలీ నిర్వ హించారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి ఆర్టీవో ఆఫీస్ మీదుగా బైపాస్ రోడ్డు వరకు జాతీయ జెండాలతో జై భారత్.. జై జవాన్ అని నినాదాలు చేస్తూ సైనికులకు సంఘీభావం తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. అలాగే యుద్ధంలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్‌కు ఘన నివాళి అర్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ఒక నెల వేతనాన్ని భారత సైన్యం నిధికి విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేషన్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధిహామీ కూలీల సంఘీభావం
కారేపల్లి, మే 10: ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహిస్తున్న భారత సైన్యానికి కారేపల్లి మండలం మాణిక్యారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలు సంఘీభావం తెలిపారు. శనివారం వారు పనిచేస్తున్న ప్రదేశం వద్ద జాతీయ జెండాలను చేతపట్టి నినాదాలు చేశారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లు మురళీనాయక్, సచిన్‌యాదవ్ వనంజేలకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలుగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తమ ప్రాణాలను సైతం లెకచేయకుండా యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్న వీరులను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల మేట్ల సంఘం అధ్యక్షుడు భూక్యా లక్ష్మణ్, చాగంటి వెంకటేశ్వర్లు(చిన్న), పోలేపల్లి రవి, భూక్యా కోటయ్య, రమేష్, ప్రసాద్, హర్దు, రాంబాబు, గణేష్, తరుణ్, అశోక్, సక్రు, వాల్యా, సైదా, వాచ్య, పాపా, కోటేశ్వరరావు, నాగయ్య, రామారావు, వెంకట్రామ్, జయమ్మ, కల్పన, కవిత, లక్ష్మి, పద్మ, రాధ పాల్గొన్నారు.
త్రివిధ దళాల కృషి సక్సెస్ కావాలి
భద్రాచలం, మే 10 : భారత్‌లో శాంతిస్థాపనకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి విజయవంతం కావాలని, దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని భద్రాచలం దేవస్థానంలోని గోశాలలో ఈవో రమాదేవి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ చేస్తున్న ‘సిందూర్ ఆపరేషన్’ విజయవంతం కావాలని, భారతావని సుభిక్షంగా ఉండాలని భద్రాచల శ్రీరామచంద్రస్వామిని వేడుకున్నట్లు ఈవో తెలిపారు.
‘పాకిస్థాన్-ఖబడ్దార్’ గీతావిష్కరణ
అశ్వారావుపేట, మే 10 : భారత్‌పై పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడిన నేపథ్యంలో రచించిన ‘పాకిస్థాన్-ఖబడ్దార్’ గీతాన్ని శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. కొత్తగూడెం కళాకారుడు, కవి, సినీగేయ రచయిత, గాయకుడు డాక్టర్ మద్దెల శివకుమార్ స్వీయ రచనతోపాటు గానం చేసిన ఈ గీతాన్ని అశ్వారావుపేటలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశ విపత్కర పరిస్థితుల్లో ప్రజలతోపాటు కవులు, కళాకారులు సంఘటితం కావాలని, పాక్ ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సైన్యానికి అండగా నిలుద్దాం..
అన్నపురెడ్డిపల్లి, మే 10 : భారత సైన్యానికి అండగా నిలుద్దామని ఎంఈవో ఆనంద్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ, మాక్‌డ్రిల్ నిర్వహించారు. జాతీయ జెండాలతో సైన్యానికి సంఘీభావంగా నినాదాలు చేశారు. వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్‌కు నివాళులర్పించి, మౌనం పాటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జర్నలిస్టుల బైక్ ర్యాలీ
ఇల్లెందు, మే 10 : ఉగ్రదాడులను నిరసిస్తూ ఇల్లెందు జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో సీఐ బత్తుల సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించారు. జగదాంబ సెంటర్ నుంచి ఆమ్‌బజార్ మీదుగా గోవింద్ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు భారత సైనికులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.