కూసుమంచి, ఫిబ్రవరి 25 : ఒడిశా నుంచి పూణేకు గంజాయిని బస్తాల్లో తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు మంగళవారం పట్టుకొని అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఖమ్మం మీదుగా మరిపెడ బంగ్లా నుంచి పూణేకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్సై నాగరాజు చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టగా.. మహేంద్రా ఎక్స్ యూవీ కారు అనుమానాస్పద స్థితిలో కనిపించింది. వెంటనే ఆపి తనిఖీ చేయగా.. అందులో ఇద్దరు వ్యక్తులతోపాటు 8 బస్తాల్లో గంజాయి బయటపడింది. పల్లపు రఘు, మహ్మద్ ఖాజాపాషా ఒడిశాలోని బాబు, సుబ్బరాజు, రామాంజనేయులు వద్ద తక్కువ రేటుకు గంజాయిని కొనుగోలు చేసి పూణేలోని సోహైల్ అనే వ్యక్తి ఎక్కువ ధరకు అమ్ముకొని వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది.
రూ.89,43,870 విలువ గల 178.870 కేజీల గంజాయి, మహీంద్రా ఎక్స్ యూవీ వాహనం, 41 గ్రాముల బంగారం, రూ.9 వేల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన పల్లపు రఘు హైదరాబాద్‌లో ట్రావెల్స్ నడుపుతూ తన కారులోనే గంజాయిని తరలించాడు. మొత్తం ఆరుగురు వ్యక్తులు పల్లపు రఘు, మహ్మద్ ఖాజా పాషా, ఒడిశాకు చెందిన బాబు, సుబ్బరాజు, పూణేకు చెందిన రామాంజనేయులు, సోహైల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధరాచారి పోలీసులు పాల్గొన్నారు.