కారేపల్లి ఏప్రిల్ 6 : శ్రీరామనవమి పర్వదినం వేడుకలను మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి, మాదారం, మాణిక్యారం, ఎర్రబోడు, బాజు మల్లాయి గూడెం, లింగం బంజర, విశ్వనాథపల్లి, వెంకట సాయి నగర్, భీక్యాతండా, సూర్యతండా తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణ వేడుకలను తిలకించారు.
భక్తులు కట్నకానుకలతో పాటు ఒడిబియ్యం సీతారామ కళ్యాణంలో సమర్పించారు. పలు చోట్ల దంపతులు పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిసర ప్రాంగణమంతా శ్రీరామనామ స్మరణలతో మార్మోగింది.