చండ్రుగొండ, మార్చి 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీరు చంద్రుగొండ మండలానికి అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెండలపాడు గ్రామ సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వను సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ పెద్దిని వేణు మాట్లాడుతూ.. చంద్రుగొండ మండలానికి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కాల్వలు ఏర్పాటు చేసి వెంటనే సాగునీరు అందించాలన్నారు.
చంద్రుగొండ మండలానికి నీరు అందించడంలో జాప్యం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తైన కాల్వ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీళ్లు తీసుకెళ్లడం అన్యాయం అన్నారు. చంద్రుగొండ మండలంతో పాటు మిగిలిన మండలాల్లో రైతాంగం ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గమనించి ప్రాజెక్ట్ పూర్తైన మేరకు డిస్ట్రిబ్యూషన్ కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు అందించాలని లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఐలూరు రామిరెడ్డి, విప్పర్ల. పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, రాయి రాజా, ఎస్కే నాగుల్ మీరా, గోగుల. తిరుమలరావు. గ్రామ శాఖ కార్యదర్శి చల్లపల్లి రాజా, చల్లా. కృష్ణయ్య, దాసరి. సీతారాములు, హనుమంతరావు, గుర్రం ప్రతాప్, బన్నె. వెంకటేశ్వర్లు, బాలికుంట, గుర్రాయిగూడెం గ్రామ శాఖ సభ్యులు పాల్గొన్నారు.