తాను నివాసం ఉంటున్న ఎర్రవల్లిలో తనను విచారించాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు తిరస్కరించడాన్ని ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం 65 ఏండ్లు దాటిన వారిని వారు కోరుకున్న ప్రాంతంలోనే విచారించాలన్న నిబంధనను కూడా సిట్ అధికారులు తుంగలో తొక్కారని ఆరోపించారు. తెలంగాణ సాధకుడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతటి కక్షపూరిత వైఖరిని అవలంబిస్తుండడం దారుణమని ధ్వజమెత్తారు. సిట్ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఎర్రవల్లిలో తనను విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించి.. నందినగర్‌లోని ఇంటికి నోటీసును అంటించారని ఆగ్రహించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ అంశంలో ఇలా కేసీఆర్ గౌరవానికి సిట్ అధికారులు భంగం కలిగించడం పట్ల శనివారం వేర్వేరు ప్రకటనల్లో ఖండనలు విడుదల చేశారు.
– ఖమ్మం, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది కక్షపూరిత వైఖరి
తెలంగాణ దార్శనికుడైన కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తాను సాధించిన తెలంగాణను కేవలం పదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ పట్ల రేవంత్ సర్కారు కక్ష్య పూరితంగా వ్యవహరించడం గర్హనీయం.
-పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
రేవంత్‌రెడ్డిది పైచాచికానందం..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఉంటున్న నివాసపు చిరునామాను సిట్ అధికారులకు ఇచ్చినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించడం గర్హనీయం. తెలంగాణను సాధించిన కేసీఆర్ గౌరవానికి భంగం కలిగేలా సిట్ అధికారులు వ్యవహరించిన తీరు దారుణం. ఈ విచారణ అంతా సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇదంతా రేవంత్‌రెడ్డి పైచాచికానందానికి పరాకాష్ట.
-తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
కక్షసాధింపు కోసమే కేసీఆర్‌కు నోటీసులు..
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ పేరట నోటీసులు జారీ చేసింది. తెలంగాణ సాధకుడి ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే సిట్ వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. తాజా నోటీసును నందినగర్‌లోని కేసీఆర్ ఇంటి ప్రహరీకి అంటించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు.
– నామా నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ
కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు ఆపాలి
తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలు ఆపాలి. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును తెచ్చారు. కేసీఆర్‌పై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. ఈ అరాచకానికి వ్యతిరేకంగా మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం భారీ నిరసన కార్యక్రమాలు చేపడతాం. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
-లింగాల కమల్‌రాజు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్
కేసీఆర్ చరిత్రను మలినం చేసేందుకే సిట్..
కేసీఆర్ చరిత్రను మలినం చేసేందుకే సిట్ అధికారులను అడ్డంపెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి నీతిమాలిన వ్యవహారం నడిపిస్తున్నారు. అయినా దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే సీఎం రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెబుతారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉదాహరణ.
– మానె రామకృష్ణ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు