Singareni | శ్రీరాంపూర్, జూన్ 11 : సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా దక్కనున్నది. సింగరేణికి గత ఆర్థిక సంవత్సరం రూ.2184 కోట్ల లాభాలు వచ్చాయి. ఇందులో ఉద్యోగులు, కార్మికులకు లాభాల వాటాగా రూ.700 కోట్లు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ప్రకటించారు. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లోంచి రూ.700 కోట్లు బోనస్ (వాటా) ప్రకటించడంపై కార్మికులు, ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దసరాకు కార్మికులు ఈ బోనస్ అందుకోనున్నారని సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, లాభాల బోనస్ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలు తీర్చనున్నది.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ కొనసాగడం, కార్మికులు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం కార్మికులకు ప్రతి ఏటా లాభాల బోనస్ పెంచుతూ వచ్చింది. గడిచిన తొమ్మిదేండ్లలో టీబీజీకేఏస్ కార్మికులకు 15 శాతం నుంచి సంస్థ లాభాల్లో వాటా పెంచుతూ, గత ఏడాది 30 శాతం సాధించి పెట్టింది. అంతే కాకుండా, సింగరేణిపై స్పష్టమైన అవగాహన కల్పించి సంస్థపై కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపారు. నిజాం కాలం నాటి సింగరేణిని గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రానికి 49 శాతం అమ్మి నాశనం చేసిందని, నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గనులు ప్రైవేట్‌పరం చేసి నాశనం చేయాలని కుట్ర చేస్తున్నదని చెప్పి కార్మికుల్లో మరోసారి ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చింది. దీంతో సింగరేణిపై పూర్తి భరోసా, భావితరాలకు పునాదిగా ఉండబోతున్నదని ధీమా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
స్వరాష్ట్రంలోనే లాభాలు ఎక్కువ..
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాకముందు 16 శాతం ఉన్న లాభాల వాటా ఉన్నది. రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, సింగరేణి సీఎండీ శ్రీధర్ పర్యవేక్షణలో సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించడంతో సంస్థకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు 30 శాతం లాభాల వాటాను తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.700 కోట్లు లాభాల వాటా సింగరేణి కార్మికులకే ఈ సంవత్సరం వస్తున్నాయి. మంచిగ మస్టర్లు చేసుకున్న కార్మిక సోదరులకు లాభాల వాటా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు కూడా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇంకా మరింత ఉత్సాహంగా పని చేస్తం. సీఎం కేసీఆర్‌పై, సింగరేణి సీఎండీ ప్రత్యేక కృషితో రాబోయే రోజుల్లో సింగరేణి మరింత అభివృద్ధి చెంది, మరిన్ని లాభాలు వచ్చి మాకు ఎక్కువగానే మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. కారుణ్య నియామకాల కింద మా కార్మికుల పిల్లలకు మళ్లీ ఉద్యోగాలు వస్తాయని అనుకోలేదు. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది. కారుణ్య నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే.
– ఎదురుగట్ల శ్రీనివాస్, ట్రామర్, కేఎల్పీ గని,
భూపాలపల్లి ఏరియా 700 కోట్ల బోనస్ ఇవ్వడం సంతోషం
శ్రీరాంపూర్, జూన్ 11 : సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.700 కోట్ల బోనస్ ప్రకటించడం సంతోషంగా ఉంది. గత ఏడాది 30 శాతం చెల్లించడంతో తమ ఇంటి ఆర్థిక అవసరాలు తీరాయి. ఈ బోనస్ సైతం పిల్లల చదువులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతాయి. కార్మికులకు ఒక్కొక్కరికీ కనీసంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లాభాల బోనస్ లభించనున్నది.
– వద్దిరాల భరత్, జనరల్ మజ్దూర్, శ్రీరాంపూర్
లాభాలు ఏటా పెరుగుతున్నయ్..
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : కంపెనీకి ఎక్కువ లాభాలు రావడంతో మాకూ లాభాల వాటా బాగానే వస్తున్నది. సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమిస్తున్నది. తెలంగాణ వచ్చినంకనే సింగరేణి లాభాలు ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయి. అంతకుముందు చాలా తక్కువ లాభాలు వచ్చేవి. అందులో 16శాతం మాత్రమే అప్పట్లో ఇచ్చెటోళ్లు. ఇప్పుడు లాభాలు ఎక్కువగా వస్తుండడంతో 30శాతం వరకు పెంచి మాకు వాటా ఇస్తున్నారు. రాష్ట్రం వచ్చినంకనే కార్మికులకు ఎక్కువగా మేలు జరుగుతున్నది. కంపెనీ భూపాలపల్లి ఏరియాలో మొదటిసారిగా డబుల్ బెడ్రూం క్వార్టర్లను కట్టించింది. ఇల్లు కట్టుకుంటే రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణంపై కంపెనీ వడ్డీ ఇస్తున్నది.
– వేల్పుల నేతాజీ, ఫిట్టర్, కేటీకే 1వ గని, భూపాలపల్లి ఏరియా
ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతి..
తాండూర్, జూన్ 11 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కార్మిక పక్షపాతి. ప్రతి ఏటా కార్మికులకు లాభాల్లో పెరుగుతున్న వాటానే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాక ముందు లాభాల వాటా చెల్లించాలని గతంలో ఉన్న ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం ఉండేది కాదు. గతంలో ప్రభుత్వ మాజీ విప్ నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ అడగకుండానే లాభాల వాటాను పెంచుతూ ఇస్తున్నారు. సంస్థకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2184 కోట్ల లాభాలు వస్తే అందులోంచి రూ.700 కోట్లు లాభాల వాటాగా సీఎం కేసీఆర్ ప్రకటించడం సింగరేణి కార్మికుల మీద ఆయనకున్న ప్రత్యేక ప్రేమకు నిదర్శనం. సింగరేణి స్వరాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నది. దానికి కారణం కచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆరే. పెరిగిన లాభాల వాటాతో మాకు, మా కుటుంబాలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మన ప్రభుత్వంలో మన కోసం పాటుపడే ముఖ్యమంత్రి కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
– మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్, తాండూర్