రుద్రంపూర్/ ఇల్లెందు, మార్చి 28 : సింగరేణిలో పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కార్మికలోకం డిమాండ్ చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే5 గనిలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ముఖాలకు నల్లరిబ్బన్లు కట్టుకొని ప్లకార్డులతో ఆందోళన చేసి అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల మెడికల్ అన్‌ఫిట్ కారణంగా సంస్థపై ఆర్థికభారం పడుతోందని చేసిన వ్యాఖ్యలు కార్మిక వ్యతిరేకమన్నారు. కార్యక్రమంలో గట్టయ్య, సందబోయిన శ్రీనివాస్, నాగేశ్వరరావు, భూక్యా రమేష్, కమల్, సందీప్, రాంచందర్, మహేష్, సుమన్, కుమార్‌రావు, సంజీవ్, సుభాష్ పాల్గొన్నారు.
సింగరేణిలో నిలుపుదల చేసిన మెడికల్ బోర్డులను వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో అన్ని మైన్లు, డిపార్ట్మెంట్స్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందించారు. జూలై, నవంబర్ నెలలో అర్హత కలిగి అన్‌ఫిట్ చేయని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని, విజిలెన్స్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు, కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలన్నారు. గత సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న రెండు వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బోరింగ్ శంకర్, గిన్నారపు మహేందర్, నమిళ్ల వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, కృష్ణయ్య, వెంకట్, విజయ్‌కుమార్, జిమ్మిడి అనుదీప్, రాజేశ్వరరావు, బాలాజీ, గడప రాజేష్, అన్వర్‌పాషా, సుధాకర్ పాల్గొన్నారు.
ఇల్లెందు సింగరేణి ఏరియాలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు జాఫర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో ఇల్లెందు ఏరియా హాస్పటల్, కేవోసీలలో కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో హెచ్వోడీలకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ మాట్లాడుతూ సింగరేణిలో పాత పద్ధతిలో మెడికల్ బోర్డు నిర్వహించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జీఎం కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, నబీ, ఏరియా నాయకులు ఎల్.రాంబాబు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.