ఇల్లెందు, డిసెంబర్ 23: ఏటా ఎంతో ఘనంగా జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ ఏడాది యాజమాన్యం సాధారణ కార్యక్రమంగా నిర్వహించిందని, సింగరేణి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్నచూపా అంటూ కార్మికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరం లేకపోయినా రకరకాల కారణాలతో సింగరేణి నిధుల్ని అప్పనంగా ఖర్చుపెడుతున్న యజమాన్యం.. సంస్థకే తలమానికమైన సింగరేణి తల్లి ఆవిర్భావ దినోత్సవానికి మాత్రం మొండి‘చేయి’ చూపడం పట్ల సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్లు సోమవారం భద్రాద్రి జిల్లా ఇల్లెందులో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
కన్నతల్లి లాంటి సింగరేణి జన్మదినోత్సవాన్ని ఇంటి పండగలా నిర్వహించుకునే కార్మికులు యాజమాన్య నిర్ణయం పట్ల మండిపడ్డారు. ప్రతి సంవత్సరం సింగరేణి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం వల్ల కార్మికులు స్ఫూర్తి పొందుతూ భవిష్యత్తు ఉత్పత్తి లక్ష్యాల సాధన పట్ల పునరంకితమవుతారు. కార్మికుల కుటుంబాలన్ని ఒకచోట చేరి మేమంతా ఒకటే అని భావనని ప్రకటిస్తారు. ఏటా ఉత్తమ కార్మికులు పొందే బహుమతులు, విద్యార్థులు, పిల్లల ప్రతిభకు గుర్తింపులు, కార్మికుల కుటుంబాల పిల్లలు ప్రదర్శించే సాంసృ్కతిక కార్యక్రమాలు, సింగరేణి సేవాసమితి కార్యక్రమాలు సింగరేణి కుటుంబంలో ఒక గొప్ప అనుభూతిని మిగులుస్తాయి. కానీ యాజమాన్యం సింగరేణి ఈ ఏడాది కార్మికుల ఆనందంలో నీళ్లు చల్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘సీఎం ఫుట్బాల్’ ఆటకు రూ.పది కోట్లు
కార్మికుల కష్టార్జితంలోని రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్రెడ్డి సింగరేణి తల్లి పుట్టినరోజును సాదాసీదాగా జరపడం సరికాదు. కార్మికుల ఏకైక పండుగకు నిధులు లేవనడం ప్రభుత్వానికి తగదు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 23న ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ గొప్ప పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సమస్యగా చేయడం కార్మికుల మనోభావాలను దెబ్బతీయడమే. కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం కార్మికుల కంటనీరు పెట్టిస్తున్నది.
-మహమ్మద్ జాఫర్హుస్సేన్, ఇల్లెందు ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు
సింగరేణివ్యాప్తంగా ‘సింగరేణి డే’ బహిష్కరణ
సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి డేను బహిష్కరించాం. గత 25ఏళ్లుగా సింగరేణి డేని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము.. కానీ ఈ ఏడాది సింగరేణి డేని రూ.50 వేలతో జరుపుకోవాలని అనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సొమ్ముతో ఆటలు, హంగు ఆర్భాటాలకు వృథా ఖర్చు చేయొచ్చు.. కానీ కార్మికుల పండుగకు మాత్రం డబ్బులు లేవా?. కార్మికుల సొమ్మును వృథాగా ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆశలపై నీళ్లు చల్లి నిరుత్సాహపరచడం తగదు.
-ఎండీ నజీర్ అహ్మద్, ఏఐటీయూసీ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు