కొత్తగూడెం సింగరేణి/ సత్తుపల్లి టౌన్/ ఇల్లెందు/ మణుగూరు టౌన్, జూలై 6: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరాయి. సీఎంవోఏఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేట్ హెడ్డాఫీస్ ఎదుట, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట అధికారులు రిలే దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో పలువురు నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన పే అప్‌గ్రేడేషన్ అమలు, పీఆర్పీ బకాయిల చెల్లింపులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి సంస్థ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నప్పటికీ యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వెంటనే అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం దీక్షల్లో అధికారులు కలేశ్వర్రావు, వినయ్‌కుమార్, నరేంద్రకుమార్, తాండ్ర శ్రీనివాస్, లింగమూర్తి, నారాయణ కూర్చున్నారు. సత్తుపల్లి దీక్షల్లో అధికారులు జీవీ రావు, కె.జగదీశ్, జి.శ్రీనివాస్, మహ్మద్ జహీద్ కూర్చున్నారు. ఇల్లెందు దీక్షల్లో ఎం.చిన్నయ్య, వి.కిషన్, ఎం.డేవిడ్ తదితరులు కూర్చున్నారు.