ఇల్లెందురూరల్, మే 13 : ఇల్లెందుకు నూతన ఓసీ వస్తే మరో 15 ఏండ్లపాటు మనుగడ కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు ప్రకటనలు ఇస్తూ ప్రజలు, నిరుద్యోగుల మనసుల్లో నూతన ఆశలు చిగురింపజేశారు. చాలు దేవుడా.. ఇతర ప్రాంతాలకు వెళ్లి నెలకు పదో, పదిహేను వేలకో ఊడిగం చేసేకంటే ఉన్న ఊర్లో ఉండి జీవనోపాధి పొందేందుకు అవకాశం తలుపుతట్టిందని నిరుద్యోగులు భరోసాగా ఉన్నారు. మొన్నటికి మొన్న 21 ఇైంక్లెన్ మూతపడగా, జేకే 5 ఓసీ మూతపడే దిశగా అడుగులు వేస్తున్నది. ఇవన్నీ తెలిసి కూడా నూతన ఓసీ వస్తే తమకు జీవనోపాధి లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ తాత, తండ్రులు సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తూ సంస్థ పురోభివృద్ధికి పాటుపడ్డారు. తాము కూడా పర్మినెంట్ కాకపోయినా ప్రైవేట్ కాంట్రాక్టు కార్మికులుగా ఉంటూ సంస్థ పురోభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తూ జీవనోపాధి పొందవచ్చని అనుకున్నారు. ఒకసారి అనుమతులు రావాల్సిందేనని, మరోసారి సింగరేణి అధికారులు పరిశీలిస్తున్నారని ఇలా పలుమార్లు సింగరేణి యాజమాన్యం ప్రకటనలు చేస్తూ రాగా నిరుద్యోగులు మరింత ధీమాగా ఉన్నారు. అదిగో పులి.. ఇదిగో తోక అన్న చందంలా ఇన్నాళ్లు మాటలు చెబుతూ సింగరేణి అధికారులు నూతన ఓసీ పనులను దాటవేస్తుండడంతో ప్రజలు, నిరుద్యోగుల్లో కొంత అలజడి ప్రారంభమైంది. నూతన ఓసీ రాకపోతే ఇల్లెందు భవిష్యత్తుతోపాటు యువత మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇతర ప్రాంతాలకు వెళ్తే సరైన ఉద్యోగాలు లభిస్తాయా? అన్న మనోవేదనలో యువత ఉన్నారు. కనీసం సింగరేణి సంస్థ యాజమాన్యం నూతన పూసపల్లి ఓసీ గురించి స్పష్టమైన ప్రకటనలు చేయకపోవడంతో మరింత గందరగోళంగా తయారైంది.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జేకే 5 ఓసీనే చిట్టచివరి మైన్. ప్రస్తుతం ప్రారంభం కానున్న నూతన ఓసీ పూసపల్లిని ప్రైవేట్‌పరం చేసేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నది. సుమారు 130 ఏళ్ల క్రితం సింగరేణిలో ఎంతోమంది కార్మికులు పర్మినెంట్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. తాత, తండ్రుల కాలం నుంచి ఇక్కడ ఉన్న వారసులు వారిని చూశారు. ప్రైవేట్‌పరం చేస్తే విధులు నిర్వహించనున్న కార్మికులకు ఎలాంటి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఉండవు. పెన్షన్ సౌకర్యం ఉండదు. సంస్థ నుంచి అనుబంధాలు ఉండకపోవడంతోపాటు పర్మినెంట్ అయ్యే అవకాశాలు పూర్తిగా కోల్పోతారు. ప్రైవేటీకరణతో లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ.. ఇల్లెందువాసులు తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు, ఉన్న ఊరిలో మనుగడ కొనసాగించాలంటే ప్రైవేట్‌పరంగా ఉద్యోగం చేస్తూ ఓసీ ఉన్నంత కాలంపాటు ముందుకు వెళ్లిపోవాల్సిందే.
రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల ధాటికి ఇల్లెందు యువత హడలెత్తిపోతున్నది. వయసు పైబడిన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లకు, భార్య, సంతానాన్ని పోషించుకునేందుకు ఇతర ప్రాంతాలకు విస్తృతంగా తరలివెళ్తున్నారు. వార్డుల్లో ఎక్కడ చూసినా ఇంటికి వేసిన తాళాలే దర్శనమిస్తాయి. ఎవరిని అడిగినా ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, హైదరాబాద్‌కు వెళ్లారని వారి బాబుకు అక్కడ ఉద్యోగం వచ్చిందని చెప్పడం సహజంగా మారిపోయింది. ఇక్కడ ప్రస్తుతం వృద్ధులు మాత్రమే ఉన్న ఇంట్లో కనిపిస్తారు. నెలకోసారి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ యువత ఇంటికి వచ్చి తల్లిదండ్రులను చూసి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి వెళ్లడం గమనార్హం. దేశానికి వెలుగులు నింపిన బొగ్గుట్ట నేడు వెలవెలబోతూ కనీసం తన కడుపులో దాచిపెట్టుకున్న ఇల్లెందువాసులకు పట్టెడన్నం కల్పించేందుకు అవకాశం లేకపోవడం విచారకరం. ఇది పాలకుల వైఫల్యమా లేక ఇల్లెందువాసులకు శాపమా.. అనేది సవాలక్ష ప్రశ్నగా మారింది.