మణుగూరు టౌన్, ఆగస్టు 16 : ప్రస్తుత ప్రైవేట్ సంస్థల నుంచి, కోల్ ఇండియా నుంచి సింగరేణి గట్టి పోటీని ఎదుర్కొంటోందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాకులను పొందేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి మొత్తమ్మీద వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం రాత్రి మణుగూరుకు చేరుకున్న ఆయన.. ఏరియా డైరెక్టర్ (పాఅండ్పా) జీ.వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆకస్మికంగా మణుగూరు ఓసీని సందర్శించారు. అక్కడి వ్యూ పాయింట్ నుంచి 640 ఆర్ఎల్ కోల్ బెంచ్ వద్ద భారీ యంత్రాల ద్వారా లోడింగ్ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
శుక్రవారం ఉదయం బంగ్లాస్ ఏరియాలో, పీకే ఓసీ సైట్ ఆఫీస్ వద్ద మొక్కలు నాటారు. పీకే ఓసీ కొత్త సైట్ ఆఫీస్ వద్ద క్యాంటీన్‌ను పరిశీలించి కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. పీకే ఓసీ వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023-24 వార్షిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత రవాణాలో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. ప్రస్తుత ఉత్పత్తి సంవత్సరంలో ఒడిశా నైనీ బ్లాక్‌తోపాటు కొత్తగూడెం వీకే గని, ఇల్లెందు రొంపేడు ఓసీ, బెల్లంపల్లి గొల్లేటి ఓసీలను ప్రారంభించి అధికోత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఈ ఏడాది 72 మిలియన్ టన్నుల నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే ప్రతి ఒక్కరూ తమ విధి నిర్వహణలో రోజుకు 8 గంటలు సంపూర్ణంగా పనిచేయాలని కోరారు. ఉపరితల గనుల్లో కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన భారీ యంత్రాల వినియోగాన్ని రోజుకు కనీసం 18 గంటలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అనంతరం సింగరేణి హైస్కూల్లో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. మణుగూరు ఏరియాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. అధికారులు వెంకటేశ్వర్లు, లక్ష్మీపతిగౌడ్, వీరభద్రరావు, శ్యాంసుందర్, శ్రీనివాస్, రమేశ్, రాంబాబు, వీరభద్రుడు, సురేశ్, షబ్బీరుద్దీన్, యూనియన్ల నాయకులు వై.రాంగోపాల్, కృష్ణంరాజు పాల్గొన్నారు.