టేకులపల్లి, సెప్టెంబర్ 27: సింగరేణి సంస్థ గణనీయమైన బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాల బాటలో పయనిస్తున్నా.. ఉపరితల గనిలో భూములు కోల్పోయిన నిర్వాసితులు మాత్రం కోయగూడెం ఉపరితల గని-2(కేవోసీ)లో టార్బల్ కట్టే కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. కేవోసీ వద్ద పొద్దంతా పని చేసినా పని ప్రదేశంలో నిలువ నీడతోపాటు కనీస సౌకర్యాలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏ కాలంలోనైనా చెట్ల నీడనే నమ్ముకుని పనులు చేసుకుంటున్న కూలీలకు కనీసం నీడ కల్పించాలనే ఆలోచన యాజమాన్యం చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
భూమి కోల్పోయిన నిర్వాసితులకు వన్‌టైం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందే తప్ప వారి బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కోయగూడెం పరిసర ప్రాంతాల్లో 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఉపరితల గనిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు బొగ్గు రవాణాలో భాగంగా లారీలు, టిప్పర్లకు లోడ్‌పై బొగ్గు పెళ్లలు జారిపడకుండా టార్బల్ కట్టే కూలీలుగా పని చేసేందుకు సింగరేణి యాజమాన్యం అనుమతి ఇచ్చింది. దీంతో కేవోసీ-2లో లచ్చగూడెం, కిష్టారం, దారపాడు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన 240 మంది నిర్వాసితులు 4 గ్రూపులుగా విడిపోయి పనులు చేస్తున్నారు.
ఒక్కో గ్రూపునకు 60 మంది చొప్పున 4 రోజులు నాలుగు గ్రూపుల వారు పనికి వెళ్లి షిప్టు విధానంలో పని చేయాలి. అయితే ఒక గ్రూపు సభ్యులు ఒక రోజు పనికి వెళితే.. మూడు రోజులు ఇంటి వద్దే ఉంటారు. ప్రతి గ్రూపు 24 గంటలపాటు పని చేయాలి. లారీలు ఎక్కువగా వస్తే కూలి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు. ఈ 24 గంటల్లో ఒక రాత్రి.. ఒక పగలు ఉంటుంది. ఈ సమయంలో కూలీలు ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లిన భోజనాలు పెట్టుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో చెట్ల కిందే ఉండాల్సి వస్తుంది. తాగునీరు కూడా లేని పరిస్థితి. దీనిని సింగరేణి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని నిర్వాసితులు వాపోతున్నారు.
కోయగూడెం ఉపరితల గని-2లో మా భూమి పోయింది. 2016 నుంచి టార్బల్ కూలీగా పని చేస్తున్నా. అప్పటి నుంచి ఏటా సింగరేణి అధికారులు వస్తున్నారు.. చూస్తున్నారు. మీకు ఎండ, వర్షం నుంచి రక్షణ కోసం షెడ్ వేస్తాం అని చెబుతున్నా.. ఇప్పటివరకు షెడ్డు వేయలేదు. దీని గురించి సింగరేణి ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలి.
-కొర్స నర్సయ్య, నిర్వాసితుడు, కిష్టారం
నాకున్న మూడెకరాల భూమి ఓసీ కింద పోయింది. దీంతో టార్బల్ కూలీగా పని చేస్తున్నా. పనికాడ కనీసం నీడ కూడా లేదు. చెట్టుకొకరు.. పుట్టకొకరు చొప్పున ఉంటున్నాం. రాత్రి సమయంలో చాలా ఇబ్బందిగా ఉంది. సింగరేణి అధికారులు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదు. నీడ కోసం షెడ్లు వేసి మాకు రక్షణ కల్పించాలి.
-జబ్బ పొట్టయ్య, నిర్వాసితుడు, కిష్టారం
సింగరేణి యాజమాన్యం అన్ని విధాల ఆలోచించి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులకు లాభాల్లో వాటా ఇస్తుంది. కానీ.. భూ నిర్వాసితులను పూర్తిగా మర్చిపోయింది. సింగరేణిలో ఒకసారి ఉద్యోగం వస్తే కంపెనీ అన్నీ చూసుకుంటుంది. కానీ.. భూమి కోల్పోయిన నిర్వాసితులకు వన్‌టైం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది.
-కొర్స చుక్కయ్య, నిర్వాసితుడు, లచ్చగూడెం
నాలుగు రోజుల్లో మూడు రోజులు ఇంటి వద్దే ఉంటున్నాం. పనికి వెళ్లిన ఒక్కరోజు కూడా లారీలు సరిగా రాక కూలి గిట్టుబాటు కావట్లేదు. సింగరేణి సంస్థ లాభాల్లో ఉన్నా.. మాలాంటి భూములు కోల్పోయిన వారిపై దయ చూపడం లేదు. విశ్రాంతి తీసుకునేందుకు కనీసం షెడ్లు లేవు. మా సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-బట్టు కోటయ్య, నిర్వాసితుడు, లచ్చగూడెం