హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో రెస్క్యూలో మహిళా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సత్తా చాటాలని సీఎండీ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సంస్థ చరిత్రలో రెస్క్యూలో తర్ఫీదు పొందిన మహిళా జట్టును ఆయన శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో అభినందించి, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ టీంను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రమాద సమయాల్లో ఈ టీం తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొని సింగరేణి కీర్తిని చాటాలని అభిలషించారు. కార్యక్రమంలో డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు, ఈడీ సుభానీ, హెచ్‌వోడీ(మార్కెటింగ్) టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా.. మహిళా రెస్క్యూ టీంకు శిక్షణ ఇచ్చిన తిరుపతి, కిషన్‌రావు, సందీప్, సాజిద్ అలీని ప్రత్యేకంగా అభినందించారు.