ఆరుగాలం కష్టించి, ఎన్నో నష్టాలకోర్చి పండించిన పంటలను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళనతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మొక్కజొన్నలను కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాలకు దెబ్బతినడంతో కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే పంటలను కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఇష్టమే లేదన్నట్లుగా కనిపిస్తోంది.
అరకొరగా కొద్దిపాటి పంటలను కొంటున్నప్పటికీ తరలించేందుకు లారీలు లేవు.. గోదాములు లేవు.. హమాలీలు లేరు.. బస్తాలు లేవు.. అంటూ చేతగానిమాటలు చెబుతూ కాలహరణం చేస్తూ రైతన్నల వెన్ను విరుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతన్నలకు పంటలను పండించడం కంటే వాటిని అమ్ముకునేందుకే ఎక్కువ కష్టాలు తప్పడం లేదు. ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు.
అన్నపురెడ్డిపల్లి/ చుంచుపల్లి/ కూసుమంచి/ తిరుమలాయపాలెం/ దమ్మపేట/ పాల్వంచ రూరల్, మే 10 : ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు. లారీలు రావడం లేదని కాంటా వేసిన బస్తాలను మిల్లులకు తరలించడంలో జాప్యం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల రాకతో అన్నదాతలు అతలాకుతలమతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని వర్షాల నుంచి కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం, మొక్కజొన్న రాసులపై పట్టాలు కప్పి కాపాడుకోవడం, తర్వాత వాటిని ఆరబెట్టుకోవడం నిత్యకృత్యమైంది. నెలరోజులు కావొస్తున్నా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిచేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోల్లు ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు..
చుంచుపల్లి మండలం పెనుబల్లి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ సరిగాలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. పంచాయతీ పరిధిలో సుమారు 147 ఎకరాల్లో 77మంది రైతులు యాసంగి సీజన్లో వరిసాగు చేశారు. సుమారు 4వేల క్వింటాళ్ల వడ్లు పండించారు. అయితే ఇప్పటివరకు ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రం వద్ద కనీసం ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయకపోవడం, అధికారులు అవగాహన కల్పించకపోవడంతో రైతులకు తెలియడం లేదు. కొనుగోలు విధానంపై స్పష్టత లేకపోవడంతో రైతులు తకువ ధరకు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు. ఇదిలాఉంటే సాక్షాత్తు వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు పరిశోధనలు చేసిన వరి వంగడాలు బీఆర్ 126, కేఎన్ఎం 1638, ఎంటీయూ 1010లను పంటలు వేసేందుకు అనుమతినిచ్చారు. గతంలో ఈ పంటలను కొనుగోలు కూడా చేశారు. కానీ ఈ యాసంగిలో పండించిన ఈ రకం పంటలను కొనేదిలేదంటూ అధికారులు చెప్పడంతో చుంచుపల్లి మండల రైతులు ఆందోళన చెందుతున్నారు.
మంత్రి గారూ.. మా గోడు వినండి..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై మొక్కజొన్న రైతులు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుట తమ గోడును వెలిబుచ్చారు. తిరుమలాయపాలెంలో శనివారం జరిగిన ప్రజాదర్బార్‌లో కేశవాపురం గ్రామానికి చెందిన రైతు జక్కుల వీరన్న ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. మొక్కజొన్నల దిగుమతిలో తీవ్ర జాప్యం జరుగుతోందని, రోజుల తరబడి గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. లారీ యజమానులు, హమాలీలు మాముళ్లు పుచ్చుకుంటున్నారని, రైతులకు ఇచ్చే బస్తాలు నాసిరకంగా ఉంటున్నాయని వివరించారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం దమ్మపేట స్థానిక మారెట్యార్డులో మొక్కలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. తరుగు పేరుతో 10కిలోల వరకు రైతుల దగ్గర నుంచి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంక్షల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
ధాన్యం, మొక్కజొన్న రైతులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు.. పంటలు రోడ్లపై ఆరబోసి వారాలు గడుస్తున్నా కనీసం వాటిని కాంటాలు వేయలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. అకాల వర్షాలకు రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి రైతుల వద్ద పంటలను వెంటనే కొనుగోలు చేయాలి.
– కందాల ఉపేందర్‌రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే
అవగాహన కల్పించడం లేదు..
మా గ్రామంలో ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు కనీసం ఫ్లెక్సీ కూడా పెట్టలేదు. మాలాంటి రైతులకు అధికారులు కనీసం అవగాహన కల్పించడం లేదు. దూరంగా ఉన్న చుంచుపల్లితండా వద్దకు రావాలని చెబుతున్నారు.. రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదు. తప్పని పరిస్థితుల్లో రైతులు దళారులకే పంటలను అమ్ముకుంటున్నారు.
– కత్తి రాకేశ్, రైతు, పెనుబల్లి, చుంచుపల్లి మండలం
ఆ వడ్లు తీసుకోవడం లేదు..
గతంలో బీఆర్ 126, కేఎన్ఎం 1638, ఎంటీయూ 1010 రకాల వడ్లను తీసుకున్నారు.. కానీ ప్రస్తుతం ఆ వడ్లను కొనమంటూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే అనుమతి ఇచ్చిన వడ్లను తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో ఆ వడ్లను చాలా తక్కువ ధరకు దళారులు కొంటున్నారు. ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నది.
– మల్లేశ్, రైతు, పెనుబల్లి, చుంచుపల్లి మండలం
దళారులకే అమ్ముకుంటున్నాం..
మాకెవరూ సరిగా చెప్పినవారులేరు.. అందరం దళారులకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని చెబుతున్నారు గాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఫోన్లు చేస్తే వేరే దూరంగా ఉన్న కేంద్రాల వద్దకు వచ్చి వడ్లు ఇవ్వండంటూ అధికారులు చెబుతున్నారు. మాకు అంతదూరం తరలించడం భారంగా ఉంది. తక్కువో ఎక్కువో ఇక్కడే దళారులకే అమ్ముకుంటున్నాం.
– ఇనుముల మంగయ్య, రైతు, పెనుబల్లి, చుంచుపల్లి మండలం