జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొత్త మెలిక పెట్టింది. ఏదైనా ఒక సహకార సంఘం నష్టాల్లో ఉండడానికి కారణమైనా లేదా నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నా ఆ పీఏసీఎస్‌ల పాలకవర్గాలకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో కొందరు చైర్మన్లకు రేవంత్‌రెడ్డి సర్కారు మొండిచెయ్యి చూపనుంది. ఈ నిబంధనలతో అలాంటి చైర్మన్ల ఆశలు గల్లంతు కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు అలాంటి సొసైటీల వివరాలు సేకరిస్తున్నారు.
-అశ్వారావుపేట, ఆగస్టు 22
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేశాయి. ఈ సహకార సొసైటీల నిర్వహణకు ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమిస్తుంది. సొసైటీల సామర్థ్యాలకు అనుగుణంగా ఒక చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికైన పాలకవర్గాలు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అమలయ్యే పథకాలను అందిస్తాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ప్రభుత్వం నియమిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న వీటికి ఎన్నికలు జరిగాయి.
వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. కానీ, వీటి ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రభుత్వం పట్ల రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహించకుండా ఆయా పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిన పదవీ కాలాన్ని 6 నెలలపాటు పొడిగించింది. ఈ కాలపరిమితి కూడా ఈ నెల 13తో ముగిసింది. అయినా ఎన్నికలకు వెళ్లకుండా ఇంకో 6 నెలలపాటు మళ్లీ పదవీ కాలాన్ని పొడిగించింది. కానీ, దఫా పొడిగింపులో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఈ నెల 13తో ముగిసిన పీఏసీఎస్ పాలకవర్గాల పదవీ కాలాల పొడిగింపు ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. ఏదైనా సొసైటీ నష్టాల్లో ఉండడానికి పాలకవర్గం కారణమైనా లేదా నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలున్నా అలాంటి పాలకవర్గాలకు ఈసారి అవకాశం ఇవ్వొద్దని ఆ ఉత్తర్యుల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు ఆయా సొసైటీల పనితీరు, ఇతర కారణాలతో కూడిన వివరాలను సేకరిస్తున్నారు. ఏ సొసైటీలు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తున్నాయో, ఇందుకు కారణాలేమిటో అనే అంశాలను అధికారులు అన్వేషిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 21 సహకార సంఘాలున్నాయి. వీటితోపాటు మరో 35 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోంది. కానీ, ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు.
ఇదిలా ఉంటే, ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలపై కొందరు చైర్మన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీకాలం పొడిగించినా కొందరు చైర్మన్లకు గుబులు పట్టుకుంది. మాకు అవకాశం ఉంటుందో లేదోనన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. పదవీకాలం పొడిగించినందుకు ఆనందపడాలో లేక అవకాశం ఉంటుందో లేదోనని ఆందోళన చెందాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఇంకొన్ని నెలలు కుర్చీలో కూర్చోవచ్చనే ధీమా కొందరు చైర్మన్లలో సన్నగిల్లుతోంది. అయితే, రాజకీయ దురేద్దశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికైన కొన్ని పాలకవర్గాలను ఈ సాకుతో కాంగ్రెస్‌కు అనుకూలంగా లేని కొందరు చైర్మన్లను రేవంత్‌రెడ్డి సర్కార్ తొలగించే కుట్ర చేపడుతుందన్న అనుమానమూ వ్యక్తమవుతోంది.
సంఘాల పనితీరు, పారదర్శకత, అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి అంశాల గుర్తింపు నిర్ణయాధికారాన్ని ప్రభుత్వం డీసీవోలకు ఇచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేని పాలకవర్గాలకే కుర్చీలో కూర్చునే అవకాశం కల్పించాలని సహకార శాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఆయా సంఘాల తీరుతెన్నులపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. జిల్లాలోని మొత్తం 21 సంఘాల్లో కొన్నింటిపై పలు ఆరోపణలున్నాయి. నిధుల దుర్వినియోగంపై విచారణలు, నోటీసుల జారీలు, సస్పెన్షన్ వేట్లు వంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో సంఘాల్లో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. తుది జాబితాను రాష్ట్రస్థాయి అధికారులకు పంపించనున్నారు. వారిచ్చే ఆదేశాల ప్రకారం అర్హులకు కుర్చీలో కూర్చునే అవకాశం కల్పిస్తారు. అనర్హులు ఉన్న సంఘాల్లో పర్సన్ ఇన్చార్జులను నియమిస్తారు.
జిల్లాలోని పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీకాలాన్ని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో ఒక నిబంధనను పొందుపర్చింది. సంఘాల ఆర్థిక నష్టం, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఉన్న సంఘాలను గుర్తించాలని సూచించింది. దీని ప్రకారం జాబితాను సిద్ధం చేస్తున్నాం. తయారు చేసిన జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అక్కడ నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వులను అమలు చేస్తాం. అనర్హత ఉన్న పీఏసీఎస్‌లలో పర్సన్ ఇన్చార్జులను నియమించే అవకాశం ఉంటుంది.
-శ్రీనివాసరావు, డీసీవో, కొత్తగూడెం