టేకులపల్లి, మే 31 : నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఆ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి అన్నపూర్ణతో కలిసి పలు విత్తన దుకాణాలను, సొసైటీ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టాక్ వచ్చిన వెంటనే రికార్డుల్లో నమోదు చేయాలని, ప్రతిరోజూ సేల్స్ వివరాలను పొందుపరచాలని సూచించారు.
దుకాణాల ఎదుట ధరల పట్టిక, స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతులకు ఇచ్చే బిల్లులో విత్తన తయారీ తేదీ, సీడ్ బ్రాంచ్, కోడ్ స్పష్టంగా నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు మీ ప్రాంతంలో అమ్మినట్లుగానీ, ఉన్నట్లుగానీ తెలిస్తే వెంటనే పోలీసు, వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తనిఖీల్లో ఏఈవో ప్రవీణ్, శ్రావణి ఉన్నారు.