ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సాగు భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఆనాడు సీఎం కేసీఆర్ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘సీతారామ’ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూ.17 వేల కోట్ల వ్యయంతో గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టు నిర్మించి అటు సత్తుపల్లి నుంచి ఇటు పాలేరు వరకు సాగునీరందించే గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం ముందుకు కదలడం లేదు. గత ఆగస్టు నెలలో ట్రయల్ రన్ వేసి ఈ ఏడాది యాసంగి పంటకు సాగునీరు అందిస్తామని చెప్పిన పాలకులు చుక్కనీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒకసారి కాదు రెండుసార్లు ట్రయల్ రన్ వేసి జలాలను రైతన్నలకు అంకితం చేసినా అది ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో గోదావరి వద్ద ప్రారంభమైన కాల్వ జూలూరుపాడు మండలం వరకు మాత్రమే పూర్తయ్యింది. దీంతోపాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల మీదుగా సత్తుపల్లి వరకు నిర్మిస్తున్న కాల్వ పనులు ఇంకా నత్తనడకన జరుగుతున్నాయి. దీంతో ఈ యాసంగికి సాగునీరు అందుతుందని రైతన్నలు పెట్టుకున్న ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు జల్లింది.
– భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
గత కేసీఆర్ సర్కారు హయాంలో దాదాపు పూర్తి చేసుకున్న ‘సీతారామ’ను ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేసినా నేటికి చుక్కనీరు కూడా రైతుల పంటలకు అందలేదు. గతంలో వచ్చిన భారీ వర్షాలతో కాల్వలకు గండ్లు పడ్డాయి. వాటి మరమ్మతుల పనులు నేటికీ కొలిక్కి రాకపోవడం విడ్డూరం. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరిస్తే గత సీఎం కేసీఆర్‌కు పేరొస్తుందని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి జూలూరుపాడు నుంచి సాగర్ కెనాల్‌కు సీతారామ నీరు లిఫ్ట్ చేసే ఆలోచనతో రూ.100 కోట్లతో మరో కాల్వను మంజూరు చేశారు. దీంతో జూలూరుపాడు మండలంలో ఉన్న రైతులు సీతారామ నీరు మాకు కాకుండా సాగర్‌కు తీసుకెళ్తే.. ఊరుకోమంటూ అఖిలపక్షం నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయినా రైతుల మాటలు వినకుండా పనులు చేపడతూనే ఉన్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు నెలలో ట్రయిల్ రన్ వేసిన ముగ్గురు మంత్రులు యాసంగి పంటకు సాగునీరు ఇస్తామని మాటిచ్చారు. కానీ.. అది వచ్చే వానకాలానికి కూడా పంటలకు నీరు అందిస్తారా.. అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇంతవరకు కాల్వ మరమ్మతు పనుల్లోనే ఇరిగేషన్ అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గత వరదల్లో కాల్వలకు గండ్లు పడితే రైతులు వేసిన పంటలు సైతం నష్టపోయారు. వారికి నష్టపరిహారం దేవుడెరుగుకానీ కాల్వ రిపేరు పనులు ఇంకా పూర్తికాకపోవడం కొసమెరుపు. బీజీ కొత్తూరు నుంచి ములకలపల్లి మండలాల వరకు ఉన్న కాల్వల్లో చుక్కనీరు కూడా లేదంటే నమ్మరేమో. చండ్రుగొండ, అన్నపురెడ్డి మండలాల్లో కూడా కాల్వ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
కాల్వ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. యాసంగికి నీరు ఇవ్వడం కుదరదు.. వచ్చే వానకాలం పంట నాటికి నీరు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని మండలాల్లో చకచకా పనులు జరుగుతున్నాయి. వరదలకు గండ్లు పడిన కాల్వకు కూడా మరమ్మతులు చేస్తున్నాం.
గోదావరి నుంచి సీతారామ కాల్వ ద్వారా సాగునీటిని సాగర్‌కు తరలిస్తే ఊరుకోం. రైతులందరం కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తాం. గుండ్లరేవు చీమలపాడు నుంచి కాల్వ వేయాల్సిందే. దాని డిజైన్ మార్చి ఏన్కూరుకు తరలించాలని చూస్తే ఊరుకోం. గతంలో ఉన్న పాత డిజైన్ ప్రకారమే కాల్వ ఉండాలి.
– పొన్నెకంటి వెంకటేశ్వర్లు, గుండెపూడి, జూలూరుపాడు మండలం
సీతారామ కాల్వలు తవ్వి చాలాకాలం అయ్యింది. అందులో పశువులు పడి చనిపోతున్నాయి. కొత్త మురిపెంలో నీళ్లు వదిలారు. మళ్లీ అడ్రస్ లేదు. పంటలకు సాగునీరు లేదు. గోదావరిలో నీళ్లు ఉన్నా వదలడం లేదు. కాల్వలకు నీరు వదిలితే మా మండలం రైతులకు ఉపయోగపడుతుంది. మొత్తం పిచ్చిమొక్కలు మొలిచి కాల్వ పెచ్చులు ఊడిపోతున్నాయి.
– గొగ్గెల ఆదినారాయణ, కమలాపురం, ములకలపల్లి మండలం
కొత్తగా చేసిందేమీ లేదు. అప్పటి నుంచి నడిచిన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నీళ్లు వదిలింది. రెండ్రోజులు నీళ్లు ఉన్నాయి. మళ్లీ రానేలేదు. ఏ పంటకు నీరు ఇస్తారో కూడా చెప్పలేదు. యాసంగికి ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నెరవేరడం లేదు. సీతారామను ఏం చేస్తారో ఏమిటో.
– నరకాటి నాగేశ్వరరావు, ములకలపల్లి