సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 25: సత్తుపల్లి నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిసారీ కేంద్రం ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మొండిచేయి చూపుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా స్థానిక సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించి, పలు తీర్మానాలపై చర్చించారు. మొదటగా సత్తుపల్లి – కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన మట్లాడుతూ.. భద్రాచలం – కొవ్వూరు మధ్య రైల్వేలైన్ నిర్మించాలంటూ తెలుగు రాష్ర్టాల ఎంపీలు అనేక ఏళ్లుగా పార్లమెంట్లో మొరపెట్టుకుంటున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకునే బీజేపీ ప్రభుత్వం.. సారపాక నుంచి కొత్తగూడేనికి ఎందుకు రైలు మార్గం నిర్మించడం లేదని ప్రశ్నించారు. తదుపరి బడ్జెట్లో అయినా ఈ రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని తీర్మానించారు. అనంతరం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపడంతోపాటు విద్య, వైద్యం, రైతుబంధు, రైతు సమస్యలు, సంక్షేమ రంగం, పల్లె, పట్టణప్రగతి వంటి అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, గురుకులాల వంటివన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలని స్పష్టం చేశారు.
అంబేద్కర్ పేరుతో దళితులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‌కు అంబేద్కర్ నామకరణం చేశారని గుర్తుచేశారు. సచివాలయం పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో కొన్ని పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ విమర్శలను ప్రతి కార్యకర్తా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గడిచిన ఏడాదిలో సత్తుపల్లి పట్టణంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి మండలంలోనూ సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ద్వారా త్వరలో సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు పట్టణాల్లో అధునాతన షాదీఖానాల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ వనమా వాసు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.