సత్తుపల్లి, జనవరి 22: గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చెరగని ముద్ర వేసుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ నెల 27న మున్సిపల్ చైర్మన్‌గా పదవీ విరమణ చేయబోతున్న కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లను అభినందించిన కేటీఆర్ వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్నారని, పనితీరు ఎలా ఉందో గ్రామసభలను చూస్తే తెలుస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని, సభల్లో టెంట్లను సైతం ఆగ్రహంతో పీకివేస్తున్నారని తెలిపారు. సత్తుపల్లిలో సండ్ర, ఖమ్మంలో పువ్వాడ ఓడిపోవడంతో ఆయా నియోజకవర్గ ప్రజలు ఎంతో కోల్పోయారని, తెలంగాణ ఏర్పడక ముందు మున్సిపాలిటీకి రూ.50 లక్షలు కేటాయిస్తే గొప్ప అని, కానీ.. కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.
కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసుకునే వరకు విశ్రమించకుండా పోరాడుదామని, ఉమ్మడి జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే.. 17 మంది ఇంకా పార్టీలోనే కొనసాగడం పార్టీ పట్ల వారికున్న విధేయతకు నిదర్శనమన్నారు. త్వరలోనే సత్తుపల్లి నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.