భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారుకు చిరుద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీ ఎటుపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏడాదికాలంగా వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన చిరుద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగుతున్నారు. ఈ మేరకు రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తున్నారు. కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నారు.
హామీలను ఎందుకు అమలు చేయరంటూ నిలదీస్తున్నారు. ‘దిగి వస్తారా? దిగిపోతారా?’ అంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆశా కార్యకర్తలు రోడ్కెక్కారు. ఇప్పుడు సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ఉద్యోగులూ అదేబాట పట్టారు. మూడు రోజుల క్రితం ఏకంగా దీక్షలు చేపట్టారు. మరో అడుగు ముందుకేసి సమ్మెకు సై అంటున్నారు. ఆ సంఘం నాయకులు రాష్ట్రవాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఎస్ఎస్ఏలోని సీఆర్టీ, ఐఈఆర్టీ, ఐఆర్పీలు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నాచౌక్లో ధర్నా చేసి సమ్మెకు పిలుపునిచ్చారు.
విద్యాశాఖలో ఏళ్లకాలం నుంచి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు రోడ్డెక్కడంతో పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంగళవారం నుంచి విద్యాబోధన నిలిచిపోనుంది. ముఖ్యంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), ప్రభుత్వ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలల్లో బోధనకు, ఇతర సేవలకు తీవ్రంగా అంతరాయం కలుగనున్నది. భద్రాద్రి జిల్లాలోని ఎస్ఎస్ఏలో మొత్తంగా 706 మంది బోధనా సిబ్బంది తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. అసలే ఉపాధ్యాయుల కొరత ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీరు సమ్మెకు దిగడంతో పాఠాల బోధన నిలిచిపోతోంది.
నిరుడు హనుమకొండ కేంద్రంగా ఎన్నికల హామీల్లో భాగంగా సర్వశిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తానని రేవంత్రెడ్డి మాట ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటింది. కానీ.. ఇంత వరకూ ఆ హామీని ఆయన నెరవేర్చలేదు. దీంతో ఏడాది కింద తమకు ఇచ్చిన హామీ ఏమైందంటూ ఎస్ఎస్ఏ తాత్కాలిక ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కనీసం టైం స్కేల్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఊరుకునేది లేదు. మాలాంటి చిరుద్యోగులను మోసగిస్తే మా ఉసురు తప్పకుండా తగులుతుంది. మాపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే మా సత్తా ఏమిటో చూపిస్తాం.
-భూక్యా మోహన్, టెక్నికల్ పర్సన్
సమగ్ర శిక్షా అభియాన్లో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న మా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తాం. చిరుద్యోగులంటే ఏంటో చూపి స్తాం. ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీలు నెరవేర్చడమంటే ఇదేనా?.
-పి.సిద్ధయ్య, ఐఈఆర్పీ
ఎస్ఎస్ఏలో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న మమ్ములను క్రమబద్ధీకరణ చేయండి. లేకపోతే కనీసం వేతనం అయినా ఇవ్వండి. 18 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో బతుకుతున్నాం. మాకు న్యాయం చేస్తామని, మమ్ములను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
-భట్టు చందర్లాల్, సీఆర్పీ