మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు అదే పాట మళ్లీ పాడతాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్డుకు వెళ్లిందని, ఆ పార్టీకి సమాధి కట్టామని, పోటీలు తమ ఇద్దరి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని, కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనమైందని. ఈ యుగళ గీతం ప్రతి ఎన్నిక తర్వాత వినిపిస్తున్నదే. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండేండ్లు గడిచిపోయినా అవే మాటలు మళ్లీ మళ్లీ మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకున్నదనేది వారికి బాగా తెలుసు. తెలంగాణ అస్తిత్వం, దానికి ప్రాతినిధ్యం వహించే బీఆర్ఎస్ చిరంజీవమైనవి.
అధికారంలో ఉన్న పార్టీలు ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవటం సర్వసాధారణమే తప్ప కొత్తది కాదు. అది 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా టీడీపీ పాలించినప్పుడు జరిగింది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ర్టాల రికార్డు కూడా అదే. ఆ విధమైన అవగాహన ఎప్పుడూ ఉన్నదే గనుక ఇక్కడ ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గానీ, ఇప్పటి మున్సిపల్ ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు రాగలవని ఎవరూ భావించి ఉండరు. అందువల్ల, ఈ విధమైన ఫలితాల్లో అనూహ్యం, ఆశ్చర్యం ఏవీ లేవు.
ఈ పరిస్థితుల్లో అధికార పక్షం గానీ, ప్రధాన ప్రతిపక్షం గానీ, ఇతర ప్రతిపక్షాలు గానీ ఎందుకోసం ప్రయత్నిస్తాయి? తమ అధిక్యతను వీలైనంత నిలబెట్టుకోవాలని ప్రతపక్షాలు, గతం కన్నా పెరిగినట్టు నిరూపించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తుంది. అందుకోసం తన చేతిలో గల అధికారాన్ని, యంత్రాంగాన్ని, అధికారం కారణంగా తేలికగా సమకూర్చుకోగల ఆర్థికాది వనరులను, తామైతేనే పనులు చేసి పెట్టగలమని ప్రజలను ఒత్తిడి చేయగల శక్తిని ఉపయోగిస్తుంది. ప్రతిపక్షాలకు ఈ సాధనాలేవీ ఉండవు. తమ సైద్ధాంతిక బలాలు ఉంటే అవి, పార్టీ యంత్రాంగ బలాలూ వినియోగంలోకి వస్తాయి.
అదేవిధంగా తమ నాయకత్వాలకు ఉండే ప్రజాదరణలు, తమ పరిపాలనలో చేసిన మంచి పనులు ఉపయోగపడతాయి. అదే సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి. ఓటర్లకు సంబంధించి తక్షణ పరిగణనలు, దీర్ఘకాలిక పరిగణనలు అని రెండుంటాయి. వాటిలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి నుంచి ఎదురయ్యే పరిస్థితులు, వారు చేయగలమనే లాభాలు, డబ్బు పంపిణీ, ఇతర ఒత్తిడులు అనే తక్షణ పరిగణనలది పైచేయి అవుతుంది. అది ఎక్కడైనా సహజమే. ఎందుకంటే ఓటర్లకు తక్షణ జీవితాలు, వాటితో ముడిపడిన పరిస్థితులు ఉంటాయి. ప్రతిపక్షాలకు ఇటువంటి తక్షణ సానుకూలతలు ఏవీ ఉండవు. కనుక తమ మంచి పనులు వగైరా దీర్ఘకాలిక సానుకూలతలది వెనుక పీట అవుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు,అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కీలకమైన తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ఐదేండ్లపాటు రాష్ట్రంలో ప్రభుత్వాధికారాన్ని నిర్ణయిస్తాయి. స్థానిక ఎన్నికలు అట్లా కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి తేడా అన్నది ఓటింగ్‌కు సంబంధించి ఓటర్ల అలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేస్తుందన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే తప్ప ఇక్కడ కొత్తగా కనుగొంటున్నది కాదు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అదే జరిగింది. అంతకుమించిన విశేషమేమీ లేదు.
ఇక ఈ తరహా ఎన్నికల్లో ప్రతిపక్షాల లక్ష్యం ఏమవుతుంది? తమ ఓట్ బేస్‌ను నిలబెట్టుకోవటం అన్నింటికన్నా ప్రధానం. అధికారపక్షం తమ వైఫల్యాల వల్ల ఓటర్లను ఏ మేరకైనా కోల్పోయి ఉంటే వారిని వీలైనంత వరకు తమవైపు ఆకర్షించటం. ఈ రెండింటిని బట్టి ఓట్లు, సీట్లలో తేడాలు కనిపిస్తాయి. అవి, అసెంబ్లీ వంటి తదుపరి ఎన్నికలకు సూచన అవుతాయి. ఈ విధంగా మౌలికమైన సూత్రీకరణల తర్వాత, ప్రస్తుత మున్సిపల్ ఫలితాలను గమనిద్దాము. మున్సిపాలిటీలు 116ను తీసుకుంటే కాంగ్రెస్ 66, బీఆర్ఎస్ 13, ఇతరులు ఒకటి గెలువగా, 36లో ఎవరికీ అధిక్యత రాలేదు. బీజేపీ ఒక్కటి కూడా తెచ్చుకోలేదు. కార్పొరేషన్లు ఏడింటిలో కాంగ్రెస్ మూడు గెలువగా నాలుగు హంగ్ అయ్యాయి.
ఈ విషయంలో కొంత స్పష్టత రావాలంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోల్చి చూడాలి. దానిని బట్టి రెండు పార్టీల మధ్య ఎవరి ప్రజాదరణ ఎంతో అర్థమవుతుంది. ఆ ప్రకారం, మున్సిపాలిటీల సంఖ్య ఇపుడు 116 కాగా, పోయినసారి 120. ఈ సారి కాంగ్రెస్ 66, బీఆర్ఎస్ 13 గెలువగా, పోయినసారి కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 112 గెలిచాయి. బీజేపీకి పోయినసారి 2, ఈ సారి సున్నా. హంగ్ అయినవి పోయినసారి 2 కాగా, ఈ సారి 36.
ఈ స్థూలమైన లెక్కలను బట్టి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో గెలిచిందో, ఇపుడు అధికారంలో గల కాంగ్రెస్‌కు లభించిన విజయాలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఇక తక్కిన వివరాలన్నీ ఇందుకు లోబడి ఉండేవే. ఎవరు ఎక్కడ గెలిచారు, ఎంత ఆధిక్యతలు, ఎక్కడ ఓడారు, ఎంత తేడాతో అనే వివరణలు, వాటిపై భాష్యాలు అన్నీ ఈ పరిధిలోకి వచ్చేవే. ఎప్పుడైనా, ఎక్కడైనా చివరి గీటురాళ్లు ఇటువంటి అంకెలే కదా. వీటితోపాటు ఓటింగ్ శాతాలు కూడా ముఖ్యమే. ఈ మాట అందరి కన్నా బీజేపీ వారికి బాగా తెలుసు. వారికి 1984 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు వచ్చినపుడు అద్వానీ అన్నదేమిటి? సీట్లు ఎట్లున్నా 7.4 శాతం ఓట్లతో కాంగ్రెస్ తర్వాతి రెండో స్థానం తమదేనని, భవిష్యత్తు కూడా తమదేనన్నారు. తర్వాత కాలంలో ఏమి జరిగిందో తెలిసిందే.
అందువల్ల, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎంతెంత చేసినా, గెలిచినా, ఆ విజయాలు పరిమితంగానే ఉండటం కనిపిస్తూనే ఉన్నది. అట్లా కానట్టయితే, హంగ్ మున్సిపాలిటీల సంఖ్య బీఆర్ఎస్ కాలపు 2 నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కాలపు 36కు (18 రెట్లు) పెరిగి ఉండేది ఎంత మాత్రం కాదు. బీఆర్ఎస్ గెలుపు శాతం 2020లో 93.33 కాగా, ఇపుడు కాంగ్రెస్ గెలుపు శాతం 56.9కి పరిమతమయ్యేది కాదు. ఇటువంటి లెక్కలు ఇంకా అనేకం చెప్పవచ్చు కానీ అవసరం లేదు. పైకి ఏమి మాట్లాడినా వాస్తవస్థితి ఏమిటో అన్ని పార్టీలు అంతర్గతంగా అర్థం చేసుకోగలవు. సామాన్య ప్రజలకు వెంటనే తెలియరాకపోవచ్చు గానీ, కొద్దిగా ప్రయత్నిస్తే కష్టం కాదు. అంత కన్నా ముఖ్యంగా, క్షేత్రస్థాయిలో నివసిస్తూ అన్నీ గమనిస్తున్నందున వారు మన కన్నా ఎక్కువ చెప్పగలరు.
ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే, పైన ఒక మాట చెప్పు కున్నాము. కాంగ్రెస్, బీజేపీలు పాడే పాటల గురించి. తాము ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ అధ్యాయమేమీ ముగిసిపోలేదని వారిద్దరికి బాగా తెలుసు. అది ముగిసేది కాదని కూడా వారికీ తెలుసు. ముగియాలన్నది వారిద్దరి ప్రగాఢమైన కోరిక మాత్రమే. ఎందుకోసం? కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ వెన్నాడే సింహస్వప్నం వంటిది. రాజకీయ పండితులు చెప్పే లెక్క ఒకటున్నది. రంగంలో మూడు నాలుగు పార్టీలు ఉన్నపుడు కనీసం 25 శాతం ఓటర్ల పునాది ఉండే ఏ పార్టీ అయినా ఎపుడైనా అధికారానికి రావచ్చు. బీఆర్ఎస్ పునాది ఎల్లప్పుడు 35 శాతానికి తగ్గకుండా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తేడా రెండు శాతం కన్నా తక్కువే. ఆ తేడాలు కొద్ది అటు ఇటుగా కొనసాగుతునే ఉన్నాయి. లేనట్టయితే కాంగ్రెస్ ఇంతగా భయపడి కలవరింత పాటలు పాడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు సీఎం రేవంత్, ఆయన బృందం నిరంతర బృంద గానం చేయటం ఏ మానసిక స్థితికి సంకేతం?
బీజేపీ పాడే ఇదే పాట మరింత ఆసక్తికరం. కనీసం ఒక్క మున్సిపాలిటీలో అయినా గెలవలేకపోవటం ఎందువల్ల? బీఆర్ఎస్ తమను ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల నాటికి దాటిపోతుందో అన్నది కాంగ్రెస్ భయం కాగా, ఆ పార్టీ తమకు అడ్డంకిగా ఉన్నంత కాలం ముందుకు పోలేమన్నది బీజేపీ భయం. అందువల్ల ఇరువురూ కలిసి బీఆర్ఎస్ పని అయిపోయిందని యుగళ గీతాలు ఆగకుండా ఆలపిస్తుంటారు. ఇది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది.
– టంకశాల అశోక్