హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరంలో శుక్రవారం ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ కన్పించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియం వైపు అభిమానులు పోటెత్తారు. ఐపీఎల్ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం ప్రచురించిన ‘బిగ్ బ్రదర్స్ చేతికి 500 ఐపీఎల్ టికెట్లు’ అనే కథనంపై సర్వత్రా చర్చ జరిగింది. ఒక్కరికే 500 టికెట్లు ఇస్తే… సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? అంటూ ప్రజలు నిలదీశారు. వీఐపీలకు ప్రత్యేక కోటా లో టికెట్లు కేటాయిస్తుండగా.. అదనంగా 500 టికెట్లు తీసుకోవడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్మకం ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అనే బోర్డులు కన్పించడం క్రికెట్ అభిమానులను అగ్రహనికి గురిచేసింది. టికెట్ల కోసం దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది క్యూలో ఉన్నట్టు తెలిసింది. టికెట్లన్నీ వీఐపీలకే ఇస్తే.. మా పరిస్థితి ఏంటి? అంటూ ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు స్టేడియం వద్ద రెండు రోజులుగా నిఘా వేసిన మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు 11 మంది బ్లాక్ టికెట్ల్ల విక్రేతలను పట్టుకున్నారు.
నకిలీ యాప్‌లు
టికెట్ల కోసం ఆన్లైన్లో ప్రయత్నించిన కొందరు నకిలీ యాప్‌ల వలలో పడ్డారు. టికె ట్ల కోసం డబ్బులు ఫలానా యాప్‌కు పంపించామని, టికెట్లు రాలేదంటూ స్టేడి యం వద్ద పోలీసులకు మొరపెట్టుకున్నారు. పోలీసులు సైబర్‌క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు.