తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. తమ పాలన బాగుంది.. జనం సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఒలకబోస్తున్న మేకపోతు గాంభీర్యం ఒట్టిదేనని తేలిపోయింది. రెండేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తాము ఇంకా మూడేండ్లూ అధికారంలో ఉంటామని, తమకు ఓటు వేస్తేనే ప్రభుత్వ పథకాలు అమలవుతాయని, తమను గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని ప్రజలను బెంబేలెత్తించినా బెదరలేదు. ప్రభుత్వ పెద్దలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తమ మనసులో ఏమనుకుంటున్నారో ఓటర్లు తేల్చిచెప్పారు. తమ పాలనకు డిస్టింక్షన్ మార్కులు వస్తాయని, 80 నుంచి 90 శాతం ఓట్లు, సీట్లతో తమను ఓటర్లు గెలిపిస్తారని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతలకు ప్రజలు మోకు దెబ్బతో సమాధానం చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే ప్రజల అసలు మూడ్ మాత్రం వేరేలా ఉన్నదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ పాలన.. ఆ ప్రభుత్వం భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు ఇవన్నీ బేరీజు వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తారు. పాలన బాగుంటే అధికార పార్టీకి 80 నుంచి 90 శాతం సీట్లు రావడం ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉన్నదనే వాదనకు సంకేతంగా నిలుస్తాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు 56 శాతం సీట్లతో ప్రభుత్వ పనితీరును జనం జల్లెడ పట్టారు. అధికారంలో ఉన్నప్పటికీ సీట్లలో స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోవడం ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమైతే, అధికారంలో లేకపోయినా బలమైన ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ప్రజల్లో ఇంకా ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ ఫలితాలు చెప్తున్నాయి.
ప్రజల నమ్మకం ఇంకా బీఆర్ఎస్పైనే ఉన్నట్టు ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. రేవంత్ సర్కార్‌కు మిగిలి ఉన్న మూడేండ్ల పాలనపై ఆశతోనే ప్రజలు అంతో ఇంతో ఓట్లు వేశారే తప్ప.. గడిచిన రెండేండ్ల పాలనను లెక్కలోకి తీసుకుంటే ఇన్ని ఓట్లు కూడా వచ్చేవి కావనే సంగతి స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయంగా 30% పైగా ఓట్లు సాధించడం యాదృచ్ఛికం కాదు.
అధికారంలో లేకపోయినా క్యాడర్ బలం నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ ప్రత్యేకతగా కనిపిస్తున్నది. స్థానికంగా ప్రజలతో బీఆర్ఎస్ కనెక్ట్ కొనసాగిందనే సంకేతం బయటికి వచ్చింది. అధికార బలాన్ని , పోలీసులను అడ్డంగా వాడుకొని, కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావులను ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ప్రజల్లో తప్పుడు అభిప్రాయం సృష్టించాలని ప్రయత్నం చేసినా.. ఎన్నికలను హడావుడిగా నిర్వహించి విపక్షాలకు సరైన సమయం ఇవ్వకుండా..రేవంత్‌రెడ్డి కాలుకు బలపం కట్టుకొని తిరిగినా, మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి హడలెత్తెంచినా ఫలితాలతో ప్రజలు తిరుగుబాటు జెండా ఎగురవేయటం అధికార పార్టీ పాలనకు ప్రజలు వేసిన మార్కులలాగే చూడాల్సి ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేస్తే.. బీఆర్ఎస్కు ఆక్సిజన్‌లాగా కనిపిస్తున్నాయి. అందుకే ఫలితాలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ తమ ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల కాలం ఉండటం వల్ల 8090% సీట్లు వస్తాయని ఆశించారు. తీరా ఫలితాలు ఆ అంచనాలకు విరుద్ధంగా రావడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారాయి.
మరోవైపు బీజేపీని పెంచి పోషించాలని రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమేనని ప్రస్తుత తాజా ఫలితాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో ఒక్క చైర్మన్ పీఠాన్ని కూడా కమలదళం సొంతం చేసుకోకపోవడం.. దాదాపు 47 మున్సిపాలిటీల్లో ఒక్క కౌన్సిలర్‌ను కూడా గెలిపించుకోకపోవడం.. బీజేపీ ఎంపీలు ఉన్న నిజామాబాద్, కరీంనగర్లో కూడా పూర్తిస్థాయి మ్యాజిక్ ఫిగర్‌ను సాధించకపోవడం ఆ పార్టీపై జనాలకున్న అభిప్రాయంగా చూడొచ్చు.
గత ఎన్నికల్లో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ కనీసం 8 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో కూడా గెలువకపోవడం, ఓటు బ్యాంకు 10 శాతానికే పరిమితం కావడం తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్తును అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి.
– ఉలుపుల శివారెడ్డి 87909 99113