కారేపల్లి మే 4 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మండలానికి చెందిన పలువురు సర్పంచులు పలు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులు ఈ వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ కోమట్ల గూడెం రెవెన్యూలో గల 277 సర్వే నెంబర్లో ఇటీవల అధికారులు సర్వే చేసి 3.22 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారననారు.
ఆ స్థలంలో ఒక ఎకరం భూమిని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాలలో నిర్మించిన సిసి రోడ్లకు ఇరువైపులా మట్టితో నింపేందుకు చెరువుల నుండి మట్టి తోలకాలు జరుపుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇటీవల వీచిన గాలి దుమారానికి అనేక గ్రామపంచాయతీలలో చెట్లు నేలకొరిగాయని, పెద్ద ఎత్తున బొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి అన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను పంచాయతీ సిబ్బందితో తొలగిస్తుంటే అటవీశాఖ అధికారులు కేసులు పెడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.