ఖమ్మం వ్యవసాయం, జూన్ 26 : గత వానకాలం సీజన్లో సాగులో లేని భూముల వివరాలు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక సర్వేను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయగా.. వాటిలో ఖమ్మం జిల్లా కూడా ఉంది. అందులో భాగంగానే ఈ నెల 25 నుంచి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేలో జిల్లాలోని 130 క్లస్టర్లకు చెందిన వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులతోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. ఈ నెల 29లోపు నిర్దేశించిన విధంగా సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గడిచిన పదేళ్ల నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగు ప్రారంభం కాగానే ఏఈవోలు క్రాప్ బుకింగ్ సర్వే చేపడుతున్నారు.
ఈ సర్వే ఆధారంగా ‘సాగు విస్తీర్ణం ఎంత జరిగింది? దిగుబడి అంచనా ఎంత ఉంది? మార్కెట్లపై పడే ప్రభావం ఎంత?’ అనే అంచనాలను ప్రభుత్వం ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిరుడు వానకాలం సీజన్లో క్రాప్ బుకింగ్‌లోకి రాని సర్వే నంబర్ల భూముల వివరాలను తెలుసుకొని వాటి వివరాలను అధికారులు ఈ యాప్‌లో పొందుపరుస్తారు. ‘సాగు చేయకపోవడానికి కారణాలేమిటి?’ అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ యాప్‌లో నమోదు చేస్తారు. ‘సాగునీరు లేకపోవడం వల్లనా?, అది రియల్ ఎస్టేట్ భూమి అయినందువల్లనా?, నివాస ప్రాంతం కావడం వల్లనా?, అవి పరిశ్రమల భూములు అయినందువల్లనా?’ అనే వివరాలు సేకరిస్తారు. అలాగే ‘ఆ భూమిని ఎన్నేళ్లుగా సాగు చేయడం లేదు? రైతు ఆర్థిక పరిస్థితి బాగాలేక సాగు చేయడం లేదా?’ అనే వివరాలను కూడా సర్వే అధికారులు సదరు యాప్‌లో నమోదు చేస్తారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే క్రాప్ నాన్ బుకింగ్ ర్యాండమ్ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది.
నిరుడు క్రాప్ బుకింగ్ చేపట్టిన ఏఈవోలే ఇప్పుడు మరోసారి నాన్ క్రాప్ బుకింగ్ భూముల సర్వే చేస్తున్నారు. యాప్ ఓపెన్ చేస్తే.. ‘ఒక్కో ఏఈవో ఎన్ని సర్వే నెంబర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాడు?’ అనే విషయం తెలుస్తుంది. అలాగే, సదరు ఏఈవోలు క్షేత్రస్థాయిలో నిర్ణీత సాగు భూమి పరిస్థితి అర్థమయ్యేలా ఫొటో తీసి దానిని ఆ మొబైల్ యాప్‌లో పొందుపరుస్తున్నారు. అయితే, ప్రసుత్తం ర్యాండమ్‌గానే నాన్ క్రాప్ బుకింగ్ సర్వే చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. సాగులో లేని భూముల పూర్తి సర్వే నంబర్లు యాప్‌లో లేకపోవడంతో ఆ సర్వే నంబర్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ‘మా భూములు ఎందుకు సర్వే చేయడం లేదు?’ అంటూ క్షేత్రస్థాయిలో సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సర్వేను కేవలం ర్యాండమ్‌గానే చేస్తున్నామని ఏఈవోలు చెబుతున్నప్పటికీ అన్నదాతల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా భూమిని గతంలో సాగు చేయలేదు. కానీ.. ఈ ఏడాది సాగు చేయబోతున్నాం.’ అని చెబుతున్నారు. ఈ సర్వేలో తమ భూమి సాగులో లేనట్లు నమోదైతే రాబోయే రోజుల్లో రైతుభరోసా పథకానికి దూరమవుతామేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా రాబోయే రెండు రోజుల్లో సమగ్ర సర్వే చేపట్టడం కష్టమని ఏఈవోలు వాపోతున్నారు. అయితే వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ సర్వే ముఖ్య ఉద్దేశం తమకు తెలియదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నామని ఏఈవోలు చెబుతున్నారు. కానీ.. అన్నదాతలు మాత్రం తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. రైతుభరోసా పథకానికి ఎంపిక కోసమే కావొచ్చని భావిస్తున్నారు.