సారపాక, అక్టోబర్ 6: డిస్పెన్సరీకి వచ్చే కార్మికుల ఆరోగ్య విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ సూచించారు. కార్మికులకు అవసరమైన అన్ని రకాల మందులను డిస్పెన్సరీలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీకి వరంగల్ జాయింట్ డైరెక్టర్ హేమలత, ఈఎస్ఐ వైద్యులు బి.చందు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీతోపాటు పలు కార్మిక సంఘాల నాయకులు డిస్పెన్సరీకి చేరుకున్నారు. పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సారపాకలో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడంతో జిల్లాలోని సుమారు 30 వేల మందికి పైగా కార్మికులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. కలెక్టర్, ఐటీసీ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. తొలుత ఐటీసీ హెచ్ఆర్ హెడ్ శ్యాంకిరణ్, ఆయా కార్మిక సంఘాల బాధ్యులు ఇక్కడి ఐటీసీ అతిథిగృహంలో ఆయనును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.