కారేపల్లి, ఆగస్టు 21 : గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకుడు గుగులోతు తేజ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓకు గురువారం వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులు మంజూరు చేయాలన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉండి మురికి కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు, ఈగలు, చెత్తాచెదారంతో దుర్వాసన విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షుడు పులకని సత్తిరెడ్డి, రైతు సంఘం నాయకులు వడ్డే వెంకటేశ్వర్లు, రావుల నాగేశ్వరావు, ధరావత్ సక్రు నాయక్, కోయిల శ్రీనివాసరావు పాల్గొన్నారు.