ఖమ్మం, జనవరి 31: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మాదిగ జాతికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఐదు నెలలు అవుతున్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఒకవైపు చెప్పుతుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన మాల ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించారని, దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద నీతి బయటపడిందని అన్నారు.
చేవేళ్ల కాంగ్రెస్ డిక్లరేషన్‌లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ఎన్నికలకు ముందు ప్రకటన చేసిన కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేస్తున్నదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపారని గుర్తుచేశారు. దళితబంధు కింద రూ.12 లక్షల ఇస్తానని చెప్పిన సీఎం ఇంతవరకు వాటి గురించి మాట్లాడటం లేదన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మిస్తే రేవంత్‌రెడ్డి కనీసం గేట్లు తీయడానికి కూడా ఇష్టపడటం లేదని, అదే అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి పాలన ఎలా చేస్తారని అది కూడా కేసీఆర్ నిర్మించింది కదా అన్నారు.
వర్గీకరణకు అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే మాదిగలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన అధికార ఖాతా ట్విట్టర్ ద్వారా ఫామ్‌హౌజ్ పాలన కావాలా? ప్రజాపాలన కావాలా అని అడిగితే 70 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన రావాలని కోరుకున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో రెండు ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ మాలలకే కేటాయించిందన్నారు. ఖమ్మం జిల్లాలో మాదిగ జనాభాకు తగ్గట్లుగా కాంగ్రెస్ సీట్లు కేటాయించాలని, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో జరిగిన నష్టాన్ని ఈ విధంగా నివారించాలని సండ్ర డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ మంద కృష్ణమాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, ఖమర్, శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.