సత్తుపల్లిటౌన్, అక్టోబర్ 1 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సత్తుపల్లిలోని సండ్ర క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాగ్ధానాలు చేసి మోసం చేసిందని, వారి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పనిచేయాలని, అందరూ కలిసికట్టుగా ముందడుగు వేస్తే విజయాన్ని సాధించగలమన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.