పెనుబల్లి, డిసెంబర్ 22 : నియోజకవర్గంలో ఇసుక, మట్టి, సింగరేణి, భవంతుల అనుమతులు, గంజాయి వసూళ్ల వంటి అన్ని రకాల మాఫియాను ప్రోత్సహించేది కాంగ్రెస్ నాయకులేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా విమర్శించారు. కల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని బెదిరింపులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే పట్టం కట్టారన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకుంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని ఆ పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి రెట్టింపుగా రాబోయే మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసిరారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏకపక్షంగా పరిపాలన సాగలేదని, అర్హుడే గీటురాయిగా అందరికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తమ రాజకీయ విధానాలను మార్చుకొని ప్రజా తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని సండ్ర కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ ఎంపీపీ బీరవల్లి రఘు, నాయకులు కట్టా అజయ్‌కుమార్, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎస్కే కమ్లీ, కొరకొప్పు ప్రసాద్, చింతలపాటి చెన్నారావు, సయ్యద్ రవూఫ్, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.