మధిర, నవంబర్ 3: మధిర నియోజకవర్గంలో వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సమాధానం చెప్పాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీపీఎం నాయకుడు మాదినేని రమేష్తో కలిసి సీపీఎం నేత సామినేని రామారావు ఇంటికెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఎం సీనియర్ నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య చాలా దారుణమన్నారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్, చింతకాని మండలం పాతర్లపాడులో హత్యలు జరగడం బాధాకరమన్నారు. రాజకీయంగా జరుగుతున్న హత్యలకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు కేసును తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆస్తి తగాదాలను అంటగడుతూ కుటుంబ సభ్యులను ఇబ్బందిపెట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లోతైన విచారణ చేసి అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెసోళ్లు దాడులు చేస్తున్నారని, మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనతో ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఇలాంటి అరాచకపు రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. లింగాల కమల్రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి వెంకటరామయ్య, సీపీఎం నాయకులు మడుపల్లి గోపాలరావు, జానకీరామయ్య, సుబ్బారావు, బీ.వెంకటేశ్వర్లు, రాము, కొల్లిబాబు, అప్పారావు, కృష్ణ, ప్రసాద్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.